విభజన హామీలపై ఆంధ్రప్రదేశ్ నుంచే స్పందన కరువైందని బీజేపీ అభిప్రాయపడుతోంది. తాము విభజన హామీల అమలు కోసం ఒక ఫార్ములా రూపొందించినా దానిపై ఏపీ అధికారుల నుంచి ఇంతవరకూ స్పందన రాలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో టీడీపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనూ విభజన హామీలపై బీజేపీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదని తెలుస్తోంది.
టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం....
ిఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్యనాయుడు కేంద్రంతో ఘర్షణ వైఖరి తగదని చంద్రబాబుకు సూచించారు. తాను విభజన హామీల అమలుకోసం మరొకసారి ప్రయత్నిస్తానని, సంయమనం పాటించాలని వెంకయ్య కోరిక మేరకు చంద్రబాబు గత ఐదు రోజుల నుంచి దానిపై మాట్లాడటం లేదు. అయితే వెంకయ్య చొరవుతో అమిత్ షాతో ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలోనూ రాని స్పష్టత.....
అయితే ఈ సమావేశంలో కూడా బీజేపీ తన స్టాండ్ కు కట్టుబడి ఉండటం విశేషం. తాము ఏపీకి సాయం చేశామని, చేయాలనే అనుకుంటున్నామని, ఇప్పటికిప్పుడు సమస్యలన్నీ పరిష్కరించాలని పీకమీద కత్తి పెడితే ఎలా అని ప్రశ్నిస్తోంది. అయితే తాము కోరుతున్న 19 అంశాలను అమలు చేయాల్సందేనని టీడీపీ పట్టుబడుతోంది. ఇందులో విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజ పట్నం పోర్టు తదితర అంశాలున్నాయి. కాని బీజేపీ మాత్రం టీడీపీ కోరుతున్న అనేక అంశాలపై ఇప్పటికే అరుణ్ జైట్లీ సభలో ప్రకటించారని, తాము సమస్యలను పరిష‌్కరించడానికే ఉన్నామని చెబుతోంది. మొత్తం మీద బీజేపీ టీడీపీతో సయోధ్యకు దిగివస్తోంది. ప్రత్యేక హోదా తప్పించి మిగిలిన హామీలన్నింటినీ అమలు చేస్తామని అంటోంది. మరి చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.