బీజేపీలో ఈ కలకలం ఏంటి?

Update: 2017-11-22 03:30 GMT

తెలంగాణలో బీజేపీ పర్యటన ఆ పార్టీని షేక్ చేసింది. రాష్ట్ర బీజేపీ నేతలు మంత్రులతో కలిసి హైదరాబాద్ లో పర్యటించడాన్ని కొందరు సీనియర్లు తప్పుపడుతున్నారు. దీనిపై అధిష్టానానికి కూడా ఫిర్యాుదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవేం పర్యటనలని పర్యటనలో ఉన్న నేతలకు ఎస్ఎంఎస్ ద్వారా తమ నిరసనను కూడా సీనియర్లు తెలియజేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ అధికారపార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు దాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రవర్తించడాన్ని పార్టీ సీనియర్ నేతలు తప్పు పడుతున్నారు.

మంత్రులతో పర్యటించడాన్ని....

హైదరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులతో కలిసి తిరగడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యటించారు. దీనికి శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి మంత్రులతో ఫొటోలు దిగడం పార్టీలో కలకలం రేపింది. ఒక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీ తమకు ఆగర్భ శత్రువైన ఎంఐఎంతో అంటకాగుతుంటే ఈ పర్యటనలేంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా పార్టీ ఫిరాయింపుల విషయాన్ని బీజేపీ శాసనసభ్యులు ప్రస్తావించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు హాజరైతే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు పంపిన వాళ్లమవుతామని హెచ్చరిస్తున్నారు. అయితే తన నియోజకవర్గంలో జరిగే పర్యటన కావడంతోనే తాను హాజరయినట్లు లక్ష్మణ్ వివరణఇచ్చుకున్నప్పటికీ సీనియర్లు అంగీకరించడం లేదు. వెంటనే పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొందరైతే ఏకంగా ఢిల్లీ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియపర్చారట కూడా.

Similar News