నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి పట్టుండటంతో టిక్కెట్లు కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో కమలనాధుల ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. రెండు సార్లు మున్సిపల్ ఛైర్మన్ పదవిని గతంలో బీజేపీ గెలుచుకుంది. ఇక మోడీ, అమిత్ షాలు ఎంటర్ కావడంతో నిజామాబాద్ లో ఓటు బ్యాంకు మరింత పెరుగుతుందని భావించిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఇది మింగుడు పడటం లేదు. నిజామాబాద్ లో ముఖ్య నేత అయిన డీఎస్ తనయుడు అరవింద్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన నిజామాబాద్ పార్లమెంటు సీటును ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఆ పార్టీ నేత యండల లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి యండల ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావిస్తుండటంతో అరవింద్ సీటుకు పెద్దగా పోటీ ఉండదంటున్నారు.
ఒకసీటుకు అనేకమంది.......
నిజామాబాద్ అర్బన్ లో గతంలో టీఆర్ఎస్ టిక్కెట్ ను ఆశించి అది దక్కక కాంగ్రెస్ లోకి వెళ్లిన పారిశ్రామిక వేత్త బస్వ లక్ష్మీనర్సయ్య కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఆయన నిజామాబాద్ అర్బన్ సీటును ఆశిస్తున్నారు. ఈయనతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా బీజేపీలో చేరారు. అయితే యండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ అర్బన్ సీటులోనే పోటీ చేయాలనుకుంటున్నారు. బస్వ లక్ష్మీనర్సయ్య చేరికను యండల వ్యతిరేకిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా యండల ముభావంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అలాగే వీరితో పాటు గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసిన ధన్ పాల్ మళ్లీ అదే టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి గతంలో యండల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా అర్బన్ నియోజకవర్గంపై పోటీ ఎక్కువ కావడంతో రాష్ట్ర నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. సీట్ల సర్దుబాటు ఎలా చేయాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారు.