బీజేపీతో పొత్తు తెంచుకోవడానికే చంద్రబాబు సిద్ధపడ్డారు. ఆయన బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడిన బాబు బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగిందేమీ లేదన్నారు. 2014 ఎన్నికల కంటే ముందుగానే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషాయన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పొత్తు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో 2014 సాధారణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా అవే ఓట్లు వచ్చాయని తెలిపారు.
దాంతో ఒరిగిందేమీ లేదు.....
అంటే బీజేపీతో పొత్తు వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని చంద్రబాబు గణాంకాలతో వివరించారు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని, వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా వెళ్లినా విజయం టీడీపీదేనన్న ధీమానుచంద్రబాబు వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ పొత్తు క్లైమాక్స్ దశకు చేరుకుంది. రేపో మాపో అధికార ప్రకటన టీడీపీ నుంచి వెలువడే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న టీడీపీ ఇంకా ఎన్డీఏలో కొనసాగడమేంటన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే దీనిపై చంద్రబాబు వివిధ దశల్లో నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
ఈ నెల 21 వ తేదీ తర్వాతనే....
ఇదిలా ఉండగా ఈ నెల 21వ తేదీన వైసీపీ అవిశ్వాసతీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. ఈ సమయంలో పొత్తు నుంచి బయటకు వస్తే వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సి ఉంటుంది. వైసీపీ అవిశ్వాసానికి మద్దతిచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. అందువల్లే అప్పటి వరకూ టీడీపీ ఎన్డీఏలోనే కొనసాగే అవకాశముంది. ఎన్డీఏ ఉన్న పార్టీని అవిశ్వాసంపై మద్దతివ్వడం భావ్యం కాదని చెప్పి తప్పించుకునే వీలుంది. అంటే ఈ నెల 21వ తేదీ తర్వాతనే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.