బీజేపీతో చాలా మంది టచ్ లో ఉన్నారట

Update: 2018-03-11 07:30 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ బీరాలు పోతోంది. ఇతర పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ, బీజేపీ తెగదెంపులు ఖాయమని తేలడంతో బీజేపీనేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా, ప్రత్యేక హోదాను ఇవ్వకుండా, ఏపీకి సాయం చేయకుండా ఉన్న కమలనాధులపై అందరూ గుర్రుగానే ఉన్నారు. బీజేపీ లో ఉన్న నేతలే బయటపడాలన్న ప్రయత్నం చేస్తున్నారు.

ఉనికిని కాపాడుకునేందుకేనా?

ఈ పరిస్థితుల్లో కమలం పార్టీ తన ఉనికిని ఏపీలో కాపాడుకోవడం ప్రధాన కర్తవ్యం. అందుకోసం ఏపీ బీజేపీ నేతలు అనేక పాట్లు పడుతున్నారు. బీజేపీ కేంద్రానికి ఎంతో సాయం చేసిందని చెబుతున్నారు. విభజన చట్టంలో పదేళ్లు హామీలను అమలుపర్చాలని పేర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడేళ్లలోనే 80 శాతం హామీలను నెరవేర్చిందని అంటున్నారు. ఇందుకు తగ్గ ఆధారాలను కూడా త్వరలో ప్రజల ముందు ఉంచుతామని పదేపదే పేర్కొంటున్నారు.

త్వరలోనే తెలుస్తుందన్న సోము....

ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం విశేషం. వారి పేర్లు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆ విషయం అందరికీ తెలుస్తుందన్నారు. కొందరు కేంద్రంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్న సోము వీర్రాజు రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Similar News