కేంద్ర్రప్రభుత్వం, బీజేపీపై అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆకలి మీద ఉందని, ఒక్కొక్క రాష్ట్రాన్ని కబళించాలని చూస్తోందని ఆయన అన్నారు. అందుకే ఏపీని కూడా తినేయాలన్నది బీజేపీ ఆకాంక్షలాగా ఉందని జేసీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబును కట్టడి చేయాలనే దుర్భుద్ధితోనే కేంద్రం ప్రతి పనికీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు జేసీ. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎంత తగ్గినా... కేంద్రం అంత రెచ్చిపోతుందన్నారు. కేంద్రం ఏపీని చిన్న చూపు చూస్తోందని, ఏపీ వాళ్ల జాగీరు కాదని గుర్తుంచుకోవాలన్నారు జేసి. తాము కేంద్రం బానిసలం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పోలవరాన్ని ఆపితే తిరుగుబాటు తప్పదని జేసీ హెచ్చరించారు. తమతో పెట్టుకుంటే బీజేపీకి మూడటం ఖాయమని జేసీ జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై కొర్రీలు ఆపకుంటే రానున్న సమావేశాల్లో వ్యక్తిగతంగానైనా తాను నిరసన వ్యక్తం చేస్తానన్నారు.