దేశవ్యాప్తంగా నియంతృత్వ పాలిటిక్స్‌కు సరికొత్త నిర్వచనం ఇస్తోన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వరుసగా అదిరిపోయే షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ సుదీర్ఘకాలంగా అధికారంలో ఉంటోన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలాంశు చతుర్వేది తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శంకర్ దయాళ్ త్రిపాఠీపై 14,133 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చతుర్వేదికి 66,810 ఓట్లు రాగా, త్రిపాఠీకి 52,677 ఓట్లు పోలయ్యారు.
ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ప్రేమ్‌సింగ్ మృతిచెందడంతో ఈ నెల 9వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తం నార్త్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఇక్కడ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బీజేపీకి ఇది పెద్ద షాకేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే యేడాది ఇక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని పోటీపెట్టిన బీజేపీ భారీ తేడాతో ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులకు కూడా మింగుడు పడడం లేదు. ఈ విజయం ఎంపీ కాంగ్రెస్‌లో మాంచి ఊపునిచ్చింది.
కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయా ?
ఇక నార్త్‌లో తనకు తిరుగులేదని, సౌత్‌లో కూడా అన్ని రాష్ట్రాలను తన గ్రిప్‌లో పెట్టుకుంటే మరో 20 ఏళ్లపాటు దేశాన్ని ఏలేయవచ్చని కలలు కంటోన్న మోడీకి ఇప్పుడు నార్త్‌లోనే సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయా.. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బను దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ ఒక్క విజయమే కాదు గత నెలలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 1.93 లక్షల భారీ ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక్కడ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ వినోద్‌కన్నా మృతిచెందడంతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం బీజేపీ, మోడీకి పెద్ద చెంపపెట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు ఎంపీలోను ఇదే తరహా షాక్ ఆ పార్టీకి తగిలింది.