బీజేపీ వదిలించుకోవాలనే అనుకుంటోందా?

Update: 2018-03-13 04:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంటే ఒత్తిడి పెంచవచ్చని భావించారు. పార్లమెంటులో ఆందోళనలు చేసి హామీలను నెరవేర్చుకుందామనుకున్నారు. ఇక ప్రతిపక్ష వైసీపీ కూడా అనేక ఆందోళనలు చేపట్టింది. విభజన హామీలు అమలు పర్చాలంటూ కాంగ్రెస్, ప్రత్యేకహోదా సాధన సమితి ఢిల్లీలో గర్జించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీ ప్రజల ఆందోళనలను కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాధులు రాజకీయ కోణంలోనే చూస్తున్నారన్న టాక్ బలంగా విన్పిస్తోంది.

ఎన్డీఏలో కొనసాగుతున్న టీడీపీ....

ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ అన్ని పక్షాలూ డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేసింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీయే ఈ ప్రకటన చేయడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాల్సి వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగినా ఎన్డీఏలో కొనసాగుతుంది. ఏపీలో బలంగా ఉన్న మిత్రపక్షాన్ని ఏ రాజకీయ పార్టీ అంత త్వరగా వదులుకోదు. కాని బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అలా లేదు.

రైల్వే జోన్ పై కూడా తేల్చేశాక.....

టీడీపీ ఎంత తొందరగా ఎన్డీఏ నుంచి వైదొలిగితే బాగుంటుందని కమలనాథులు భావిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పారు. తాజాగా రైల్వే జోన్ పై కూడా చేతులెత్తేశారు. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్. నిన్న మొన్నటి దాకా రైల్వే జోన్ పై తాము పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పిన కేంద్రం అది ఇక సాధ్యం కాదని తేల్చేసింది. అసలే ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పారని ఆగ్రహంతో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది మరింత ఆశనిపాతమయింది. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నా రైల్వే జోన్ ను కూడా సాధించుకోలేక పోయారన్న విమర్శలను అధికార టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

బాబు ఏం చేయనున్నారు?

ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కోసం ఇప్పటికే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది కూడా లేదని తేల్చి చెప్పేయడంతో టీడీపీ ఏంచేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. టీడీపీని తమ గూటిలో ఉంచుకోవడం ఇష్టంలేక, పొమ్మనలేక పొగ బెడుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్డీఏలో ఉండి హామీలను సాధించుకుందామనుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేయనున్నారు? ఎన్డీఏ నుంచి తప్పుకుంటారా? లేక మరోసారి కేంద్రంతో చర్చలు జరిపి రైల్వేజోన్ సాధిస్తారా? వేచిచూడాలి.

Similar News