రాజ్యసభ ఎన్నికలు వచ్చేశాయి. ప్రస్తుతం హీట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా మార్చి 23న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో ఓట్ల దామాషా ప్రకారం రెండు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కే అవకాశముంది. అయితే మూడో సీటుకు కూడా పోటీ పెట్టాలన్న యోచనలో టీడీపీ ఉంది. వైసీపీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలను చేర్చుకుని మూడో స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నది ఆ పార్టీ ప్లాన్. ఇందుకోసం కొందరు ఎమ్మెల్యేలతో టీడీపీ అధిష్టానం టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలలో....
అయితే ఇప్పుడు బీజేపీ ట్విస్ట్ ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. శాసనసభలో వైసీపీకి 45 మంది సభ్యుల బలం ఉంది. ఈ బలంతో ఒక స్థానాన్ని సులువుగా గెలుచుకునే వీలుంది. అయితే ఒక్క ఎమ్మెల్యే మారినా ఇబ్బందులు తప్పవు. ఇదే సమయంలో బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోంది? అన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. చంద్రబాబు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకోవడంతో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించింది. చంద్రబాబు సర్కార్ ను ఇరుకున పెట్టేందుకే రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించిందన్న వార్తలు కూడా వస్తున్నాయి.
నలుగురు శాసనసభ్యులు....
అయితే బీజేపీకి శాసనసభలో నలుగురు సభ్యులున్నారు. మూడో అభ్యర్థిని టీడీపీ నిలబెడితే బీజేపీ సభ్యుల అవసరం కూడా పాలకపార్టీకి ఉంటుంది. గత ఎన్నికల్లో రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి చెందిన ప్రస్తుత కేంద్రమంత్రి సురేష్ ప్రభు కు ఇచ్చింది. సురేష్ ప్రభుకు గతంలో ఇచ్చాము కాబట్టి తమకు మద్దతివ్వాలని టీడీపీ కోరే అవకాశముంది. అయితే ఇదే సమయంలో మార్చి 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలను రూపొందించుకుంది. అవసరమైతే సభను స్థంభింప చేయాలని, కేంద్రమంత్రులు ఇద్దరూ రాజీనామా చేయాలని కూడా దశల వారీగా ప్రణాళిక రూపొందించుకుంది.
పార్లమెంటు సమావేశాల్లో తీరును బట్టి....
మార్చి 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైతే, మార్చి 23వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి తాము ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకుంటామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. విభజన హామీలపై టీడీపీ ఏమాత్రం తగ్గకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే ఇక్కడ కూడా బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలన్నది బీజేపీ వ్యూహంగా కన్పిస్తుంది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.