బీజేపీ ఈ ప్లాన్ తో సక్సెస్ అవుతుందా?

Update: 2017-11-25 13:30 GMT

తెలంగాణ బీజేపీ మరోసారి నిరుద్యోగుల సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమవుతుందని చెబుతూ త్వరలో నిరుద్యోగుల సమరభేరిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. తెలంగాణ ఆవిర్భావ లక్ష్యాన్ని మరిచి టీఆర్ఎస్ సర్కార్ నడుకుంటున్నదన్నది బీజేపీ ఆరోపణ. ఇటీవల కాలంలో బీజేపీ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. అమిత్ షా వచ్చి వెళ్లిన తర్వాత తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన సభ తప్పించి తర్వాత ఎలాంటి కార్యక్రమాలను ఆ పార్టీ నిర్వహించ లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. మరోవైపు బీజేపీలోకి ఏ నేత వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ పార్టీ ఉందో లేదో? కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ యువమోర్చా భారీ సభకు నడుంబిగించింది.

నిరుద్యోగ సమరభేరితోనైనా.....

ఈ నెల 26వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ ఉద్యోగాలను మాత్రం భర్తీ చేయలేదు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా కుంటిసాకులు చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ మ్యానిఫేస్టోలో చెప్పినట్లు ఇంటికో ఉద్యోగం ఎక్కడని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రభుత్వం దాటవేచే ధోరణిని అవలంబిస్తుందంటున్నారు. ఇప్పటి వరకూ 16 వేల ఉద్యోగాలను ఇస్తే అందులో 11 వేలు కానిస్టేబుల్ పోస్టులే ఉండటం గమనార్హం. నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వకపోతుండటంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారంటున్నారు. పాలిటిక్నిక్ సంస్థలు, యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సమరభేరితో క్యాడర్ లో కొత్త ఉత్సాహం వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Similar News