తెలంగాణ బీజేపీలో అంతర్మధనం మొదలయింది. తమకు స్వేచ్ఛ లేకపోవడం వల్లనే నిన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పుంజుకుందన్నది రాష్ట్ర బీజేపీ నేతల విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలం పుంజుకోవడం, అధికార పార్టీకి ప్రధాన పోటీ కాంగ్రెస్ అనే సంకేతాలు వెలువడటంతో రాష్ట్ర బీజేపీ నేతలు డీలా పడ్డారు. ముఖ్యంగా జాతీయ పార్టీ తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన వారిలో వ్యక్త మవుతోంది. పార్టీలో చేర్చుకోవడానికి తమకు స్వేచ్ఛ నిచ్చి ఉంటే ఇప్పటికే అనేక మంది నేతలు క్యూ కట్టేవారంటున్నారు. కాని అనేక షరతులు ఉండటంతో బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వస్తామన్న నేతలు కూడా కాంగ్రెస్ కండువాను కప్పేసుకుంటుండటంతో బీజేపీ నేతలు ఇక ఢిల్లీ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు.
జాతీయ పార్టీదే తప్పంటున్న....
అమిత్ షాను మరోసారి తెలంగాణలో పర్యటించేలా చూడాలని పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అయితే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బిజీగా ఉండటంతో ఆ ఎన్నికల తర్వాత అమిత్ షాతో భేటీ కావాలని రాష్ట్ర నేతలు నిర్ణయించుకున్నారు. పేరుకు ఇక్కడ రాంమాధవ్, మురళీధరరావు వంటి నేతలున్నప్పటికీ వారు సరైన దిశానిర్దేశం చేయడం లేదని ఇక్కడి నేతల ఆవేదన. ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో ఇక పార్టీలో ఉత్తేజం తేవాల్సిందేనంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. లేకుంటే అసలుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారు. ఎనిమిది నెలల క్రితం అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణలో ఒంటరిపోరు చేస్తామని చెప్పారు. దక్షిణాదిన బీజేపీ పాగా వేసేందుకు తెలంగాణ నుంచే మొదలుపెడగతామని చెప్పారు. కాని అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటి లాగా ఉంది.
రాష్ట్ర నేతలపై మండిపాటు....
అయితే రాష్ట్ర పార్టీ నేతల్లో అనైక్యత, కార్యచరణ లేమితో జాతీయ పార్టీ విసుగుచెందినట్లు చెబుతున్నారు. ఇంత అవకాశమిచ్చినా అందిపుచ్చుకునే ధోరణిని రాష్ట్ర నేతలు అవలంబించడం లేదన్నది జాతీయ నేతల అభిప్రాయం. అందుకోసమే అమిత్ షా ఇటీవల కాలంలో తెలంగాణను పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇతర పార్టీల నేతలను చేర్చుకోమని తాను ఆదేశించి వెళ్లినా ఇంతవరకూ ఆ ప్రయత్నం చేయకపోవడంపై అమిత్ షా రాష్ట్ర నేతలపై మండిపడుతున్నట్లు సమాచారం. అయితే జాతీయ నేతల్లో తమపై ఉన్న అపోహలను తొలగించేందుకు రాష్ట్ర నేతలు హస్తిన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. జాతీయ అధ్యక్షుడిని కలిసి రాష్ట్రంలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, అలాగే రాష్ట్రంలో పర్యటించాలని కోరనున్నట్లు తెలిసింది. గుజరాత్ ఎన్నికల తర్వాతే అమిత్ షా వీరిని కలవనున్నారు. దీంతో వీరు గుజరాత్ ఎన్నికలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తున్నారు. మరి అమిత్ షా వీరికి క్లాస్ పీకుతారా? లేక వీరి అభిప్రాయంతో ఏకీభవించి తెలంగాణ పర్యటనకు వస్తారా? అన్నది తేలాల్సి ఉంది.