బిజెపిలో హరిబాబు పై తిరుగుబాటు ...?

Update: 2018-02-19 03:30 GMT

భారతీయ జనతాపార్టీ అంటే అత్యంత క్రమశిక్షణ గల పార్టీగా పేరుంది. అలాంటి ఆ పార్టీలో కీలకమైన తరుణంలో లుకలుకలు బయటపడ్డాయి. ఎప్పటినుంచో తమ ఏపీ శాఖ అధ్యక్షుడు టిడిపి అనుకూల వైఖరి పార్టీని ముంచుతుందని ఆందోళన చెందుతున్న కమలనాథుల్లోని ఒక వర్గం తిరుగుబాటు జెండా ఆయనకు వ్యతిరేకంగా ఎగరవేసే పరిస్థితి వచ్చి పడింది. రాజకీయంగా ఏపీలో బిజెపి కి గడ్డుకాలం ఎదురైనా స్థితిలో కూడా హరిబాబు వేచి చూసే ధోరణి అంటూ టిడిపి పై మెతకవైఖరి అనుసరించడాన్ని ఒక వర్గం పదాధికారుల సమావేశంలో బాహాటంగా వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితి మీ వైఖరి వల్లే దాపురించిందనే రేంజ్లో కొందరు అధ్యక్షుడి సమక్షంలోనే చెలరేగిపోయారు. ఆయనకు దణ్ణం పెడుతూ ఇప్పటికైనా పార్టీని కాపాడాలంటూ ప్రాధేయపడ్డారు.

మంత్రి మాణిక్యాల రావు డోంట్ కేర్ ...

తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అధిష్టానం ఆదేశాలే తరువాయి అంటూ పదాధికారుల సమావేశంలో మంత్రి మాణిక్యాల రావు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధ్యక్షుడు హరిబాబు ప్రయత్నం చేసినా ఆయన కేర్ చేయలేదు. అత్యధికశాతం మంది టిడిపి పై మరింత దూకుడు పెంచాలనే అద్యక్షుడి పై వత్తిడి తెచ్చారు. పార్టీ వర్గాలనుంచి వెల్లువెత్తిన నిరసన చూసి హరిబాబు అవాక్కయ్యారు. కేంద్రం చేసింది ఏమీలేదంటూ టిడిపి చేస్తున్న దాడికి ఎదురుదాడి వ్యూహాన్ని బిజెపి డిసైడ్ చేసేలా సమావేశం లో నిర్ణయాలు జరిగిపోయాయి. వాస్తవానికి ఈ తరహా దూకుడు అధ్యక్షుడు హరిబాబు ఆశించడం లేదు. ఆచితూచి అడుగులు వేయాలనే ఆయన పార్టీ వర్గాలను కోరినా ఎవరు వినే పరిస్థితే లేకుండా పోయింది. ప్రధాని మోడీ, అమిత్ షా లను టిడిపి అన్ని అన్ని మాటలు అంటుంటే ఇంకా సంయమనం వహించడం వల్ల పార్టీకి వచ్చే నష్టం అంతా ఇంతా కాదంటూ అంతా చెలరేగిపోవడంతో హరిబాబు ఇక చేసేది ఏమిలేకుండా పోయింది.

శాసనసభ, శాసనమండలిలో విపక్ష పాత్రలో బిజెపి ...

అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్షం డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ, శాసన మండలిలో అధికారపక్షం హవాకు అడ్డే లేకుండా పోయింది. పార్లమెంట్లో టిడిపి చేస్తున్న నిరసనకు విరుగుడుగా ఇప్పుడు అసెంబ్లీలోనూ, శాసన మండలిలో విపక్ష పాత్ర పోషించేందుకు బిజెపి సిద్ధమైంది. అమరావతి, పోలవరం లలో అవినీతి చిట్టా విప్పేస్తామని బిజెపి ఎమ్యెల్యేలు , ఎమ్యెల్సీ లు పార్టీ వేదికమీదే ప్రకటించేశారు. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కమలనాధులు అధికార టిడిపి పై చేసే ఎటాక్ ఏవిధంగా వుండబోతుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Similar News