పోలవరం ప్రాజెక్ట్ ను అంతా తానై చేస్తున్నట్లు టిడిపి తొలినుంచి వ్యవహరిస్తూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి చట్టంలో పెట్టినా తాను పూర్తి చేస్తానంటూ తీసుకుని కేంద్రంలో బిజెపిని డమ్మీ చేయాలన్న ప్లాన్ లోనే టిడిపి సాగిందన్న ఆరోపణల్లో నిజం ఉందని తాజాగా బిల్లుల లొల్లితో తేలిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం సహకారం లేనే లేదని చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని, ప్రాజెక్ట్ ఆపడానికి కుట్ర జరుగుతుందంటూ టిడిపి తన అనుకూల మీడియా లో పెద్దఎత్తునే ప్రచారం సాగించింది. తమ పార్టీ పై జరుగుతున్న దుష్ప్రచారం తెలుసుకోవడానికి కేంద్రానికి చాలా రోజులే పట్టింది. పోలవరం అధారిటీ అనుమతి లేకుండా అనేక నిబంధనలు ఉల్లంఘించి సాగుతున్న వ్యవహారాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ గా దృష్టి పెట్టడమే కాదు తమపై సాగుతున్న తప్పుడు ప్రచారం పై మండిపడ్డారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి పరిశీలన చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.
బిల్లులు ఎందుకు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు ...?
పోలవరం ప్రాజెక్ట్ పై ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి చెల్లిస్తామని అయితే చేసిన పనులకు సకాలంలో బిల్లులు పంపాలని కేంద్రం ఎప్పుడో చెప్పింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులు పంపకుండా కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ గందరగోళం సృష్ట్టించడం చర్చనీయాంశం అయ్యింది. విపక్షాలు, జనసేన సైతం ఎందుకు బిల్లులు విషయంలో ఇలా వ్యవహరిస్తున్నారని నిలదీయడంతో చివరికి 2544 కోట్ల రూపాయల విలువైన భూసేకరణ బిల్లులు కేంద్రానికి అందజేసింది ప్రభుత్వం. దీనిపై పరిశీలన జరిపి కేంద్రం ఈ నిధులను విడుదల చేయనుంది. దాంతో ఇప్పటివరకు నిధులు మంజూరు చేయడం లేదంటూ బిల్లులు పంపకుండా అల్లరి చేసిన టిడిపి సర్కార్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇంత సీన్ నడిపినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు