బిజెపి పై అవంతి వ్యాఖ్యల వెనుక ...?

Update: 2018-01-22 02:30 GMT

సరైన సహకారం అందించకపోవడం వల్లే ఏపీ అభివృద్ధిలో కుంటుపడింది అనే ప్రచారం ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళే పనిలో పడింది టిడిపి. అదికూడా కర్ర విరక్కూడదు పాము చావకూడదు అనే రీతిలోనే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు పొలిటికల్ మాస్టర్ చంద్రబాబు. తాను ఎక్కడా బయటపడకుండా విజువల్ గా దొరక్కుండా చూసుకుంటూ పార్టీ అనుకూల మీడియా ద్వారా ఏది ఎలా వెళ్లాలో అలా పక్కా గా వెళ్ళే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు అని ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే పార్టీ వర్క్ షాప్ ఏర్పాటు చేశారంటున్నారు. ఈ వర్క్ షాప్ లో ఎలా మాట్లాడాలి ఏమి మాట్లాడాలో క్లియర్ గా దిశా నిర్దేశం ముందే అవంతి శ్రీనివాస్ కి జరిగిందన్నది టిడిపి వర్గాల అంతర్గత సమాచారం. అంత పెద్ద వర్క్ షాప్ లో ఒకే ఒక్కరు గళమెత్తారు. ఆయనే ఎంపీ అవంతి శ్రీనివాస్. మిగిలిన ఎంపిలు కానీ, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీ లు ఎవ్వరు నోరు మెదపలేదు.

అనుకున్నట్లే బిజెపిపై అవంతి ...

అమరావతికి 30 వేలకోట్ల రూపాయలు అవసరమైతే 300 కోట్ల రూపాయలే ఇస్తారా ..? కేంద్ర విద్యా సంస్థలకు 11500 కోట్ల రూపాయలు విలువైన భూములు అప్పగిస్తే 150 కోట్ల రూపాయలా ఇచ్చేది ..? ఇలా కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో ఎప్పటికి ఏపీ సమస్యలు తీరతాయని అధినేత చంద్రబాబును నిలదీశారు అవంతి. ఎప్పటిలాగే చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేసి ఏమి సాధించలేమని సామరస్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు పోతున్నామన్నారు. ప్రధానితో సమావేశంలో అన్ని సమస్యలు ప్రస్తావించామని ఆయన సానుకూలంగా స్పందించారని మళ్ళీ పాతపాటే పాడారు. అవసరమైన అంశాల్లో సమాజ శ్రేయస్సు కోరి సిద్ధాంత పరంగా విభేదిస్తామని త్రిబుల్ తలాక్, హజ్ యాత్రికుల సబ్సిడీ రద్దుపై టిడిపి బిజెపి కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో వ్యవహరించిన తీరు వివరించారు. అసదుద్దీన్ ఒవైసి తనకు ధన్యవాదాలు తెలిపారంటూ తెలుగుదేశాధినేత చెప్పుకొచ్చారు. ఇలా ఒక పక్క బిజెపికి తనదైన శైలిలో పార్టీ క్యాడర్ తో హెచ్చరికలు చేయిస్తూ, మరోపక్క సామరస్యమంటూ తన నోటితో చెబుతూ డబల్ గేమ్ స్టార్ట్ చేసి బాబు తన మార్క్ రాజకీయానికి తెరతీశారు.

ఇంకా సన్నాయి నొక్కులు ....

కేంద్రం విభజన సమస్యలు నాలుగేళ్ళు అయినా పరిష్కరించలేకపోయినా చంద్రబాబు మోడీపై ఫైర్ కాలేకపోతున్నారు. ఎవరో ఒకరిచేత తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కూల్ కూల్ అంటూ వారిని బుజ్జగిస్తూ పొలిటికల్ గేమ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు. దీనివల్ల ఆయా సమస్యలు పరిష్కారం కాకపోయినా బిజెపిపై ప్రజల్లో ద్వేషాన్ని రగల్చడంలో విజయవంతం అవుతున్నారు. అలాగే టిడిపి పట్ల సానుభూతి పొందేందుకు ఇదే అంశాన్ని చక్కగా అవకాశం వాడుకుంటున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం లేదా పొత్తులు తెగతెంపులు కోసం రెండు పార్టీలు ఎలా నడుచుకున్నా వీరి నాటకాలకు మాత్రం ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న విశ్లేషకులు విమర్శిస్తున్నారు. మరో పక్క బాబు తాజా గేమ్ బిజెపి శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వారు నేరుగా ఎవరిపై విమర్శలు ఆరోపణలు చేయాలో అర్ధం కాక అయోమయానికి గురౌతున్నారు. ఏపీ బిజెపి లోని అధ్యక్షుడు హరిబాబు వర్గం టిడిపి అనుకూల వైఖరి తమ కొంప ముంచేలా ఉందని ఆందోళన చెందుతున్నారు.

Similar News