ఏపీలో సొంతంగా ఎదగాలని భావిస్తున్న బిజెపి శ్రేణులు టిడిపి ని వదిలించుకున్నామన్న సంతోషంలో వుంది. ఇక ఆ పార్టీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్ళి మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి ఇచ్చిన నిధులను ప్రచారం చేసుకోవాలని డిసైడ్ చేసింది కమలం పార్టీ. ప్రస్తుతం ఏపీకి ఏమీ చేయలేదనే ప్రచారం కేంద్రంపై పెద్దఎత్తున టిడిపి చేయడం తో మైనస్ లో ఉన్నామని, అయితే గత నాలుగేళ్లుగా ఏమి జరిగిందో వివరించాలని బిజెపి శ్రేణులు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. తమ మంత్రులు రాజీనామా చేసిన తరువాత టిడిపి సర్కార్ అవినీతి పుట్ట తవ్వేస్తామంటున్నారు వారు.
ఇక వార్ వన్ సైడ్ ....
బిజెపి బూత్ స్థాయిలో పటిష్టం కావడానికి ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే భారీ ప్రచారం సాగించింది. రాబోయే ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు అమిత్ షా వ్యూహాల నేపథ్యంలో ఎపి బిజెపి అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణంగా కమలనాధులు భారీ సమాలోచనలు సాగిస్తున్నారు. ఇక పై కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి ని భారీ ప్రచారం చేసుకోవాలన్న నిర్ణయంలో ఉన్నట్లు బిజెపి వర్గాల టాక్. అడుగడుగునా తెలుగుదేశం తో సహా అన్ని పక్షాలపైనా యుద్ధం చేయాలని బిజెపి వ్యూహరచనతో సాగుతుంది..