బిజెపి ఆరోపణలు నిజం చేస్తున్నారా...?

Update: 2018-02-21 06:30 GMT

ఎపి లో పాలన జరగడం లేదు. పక్కా వ్యాపారం ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అడుగడుగునా ఇదే జరుగుతుంది. ఇసుక మాఫియా నుంచి మలవిసర్జనకు వినియోగించే టాయిలెట్ల వరకు, రోడ్లు డ్రైన్ల నుంచి చెట్టు మట్టి వరకు, ఇక సాగునీటి ప్రాజెక్టుల సంగతి సరే సరి నిధులన్నీ కృష్ణార్పణం. కేంద్రం ఇస్తున్న వేలకోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. మన రాష్ట్రంలో పాలన ట్రేడింగ్ గా మారిపోయింది అంటూ బిజెపి ఎమ్యెల్సీ సోము వీర్రాజు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎన్నికల ఏడాది జాగ్రత్తగా వుండండని తమ్ముళ్ళకు ఒక పక్క అధినేత చంద్రబాబు నెత్తినోరు కొట్టుకుంటూ చెబుతున్నా... రాజకీయాన్ని వ్యాపారంగా అలవాటుగా మార్చుకున్న కొందరు తమ పంధా మార్చుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశానికి అప్రదిష్ట కావలిసినంత మూట కట్టేస్తున్నారు.

కడపలో 20 కోట్ల కాంట్రాక్ట్ కోసం రోడ్డున పడి....

కొందరు తెలుగు తమ్ముళ్ళు వ్యాపార పోటీ ఎంత దూరం పోయిందంటే ఒకరిపై మరొకరు దాడులు చేసుకునేంతగా. కడప జిల్లాలో 20 కోట్లరూపాయల రోడ్డు పనులకోసం టెండర్ల తేదీ పొడిగించడంతో ఇవి దక్కుతాయని ఆశపడ్డ మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరగణం ఆ పనులు అందినట్లే అంది దూరం కావడంతో ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంపై దాడికి పాల్పడింది. టెండర్ కూడా వేయని సీఎంరమేష్ చిన్న చిన్న పనులు కూడా తమనుంచి లాగేసుకోవాలని చూస్తున్నారన్న ఆగ్రహంతో మంత్రి వర్గం భగ్గుమంది. టెండర్లకు చివరి రోజు అంతా అయిపొయింది పనులు తమ చేతికి వచ్చేస్తాయని భావిస్తే రమేష్ వెనుకుండి టెండర్ల తేదీ పొడిగించారన్నది మంత్రి వర్గీయుల ఆరోపణ. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు నేరుగా సీఎంరమేష్ కార్యాలయంపై దాడికి పాల్పడటం కేసులు పెట్టుకోవడం వరకు వ్యవహారం వెళ్ళింది. మరోవైపు భారీ కాంట్రాక్ట్ లన్ని ఎలాగూ తనఖాతాలో చుట్టేస్తున్న రమేష్ చిన్నా చితకా కూడా నొక్కేస్తే తామెలా బతుకుతామన్నది మంత్రి వర్గీయుల వాదన.

పంచాయితీ బాబు దగ్గరకు ...

ఇలాంటి వ్యవహారాలలో మంత్రి వర్గానికి సీఎంరమేష్ వర్గీయులకు నడుమ ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ని తెచ్చిపెట్టింది. ఒకరిపై మరొకరు పార్టీ అధిష్టానానికి సైతం కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు సైతం చేసుకుంటున్నారు. తాజా వివాదాన్ని కూడా ముఖ్యమంత్రి వద్దే తేల్చుకోవాలని ఇరు వర్గాలు డిసైడ్ అయ్యాయి. అసలే కేంద్రంతో యుద్ధంతో తలబొప్పికట్టిన ముఖ్యమంత్రి ఇలాంటి చిల్లర వ్యవహారాలు జిల్లాలనుంచి వస్తున్న నేపథ్యంలో వారికి చీవాట్లు పెట్టి పంపిస్తున్నారు. మొత్తానికి కడపలో రోడ్డున పడ్డ తాజా వివాదాం రాజకీయం అంటే వ్యాపారమే అనే పరిస్థితిని మరోసారి తేటతెల్లం చేసింది. దీనిపై సిఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటారా లేదా, ఇద్దరికి సరిహద్దులు నిర్ణయించి వదిలేస్తారా ? చూడాలి.

Similar News