బాలయ్యను జగన్ టచ్ చేయరా?

Update: 2017-12-26 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఇప్పుడు వైసీపీ అభిమానుల్లోనూ, టీడీపీ కార్యకర్తల్లోనూ చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ సినీనటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని టచ్ చేయకపోవడంపై అందరూ చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలకృష్ణ నియోజకవర్గంలో ఇటీవల నియోజకవర్గంలో పర్యటించడం లేదని, సమస్యలు పేరుకుపోతున్నాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటోంది. హిందూపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉండటంతో బాలకృష్ణ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. బాలయ్య సొంత పార్టీలో కూడా గతంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

బాలయ్యకు వీరాభిమాని....

అంతేకాకుండా వైఎస్ జగన్ చిన్నప్పటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిగా చెబుతారు. ఆయన బాలకృష్ణ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుండేవారు. జగన్ ఎప్పుడూ బాలయ్య బాబును నేరుగా విమర్శించ లేదు. అలాగే బాలకృష‌్ణ కూడా జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటించకపోవడం రెండు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అటువంటి కంచుకోటలో జగన్ ఎందుకు పర్యటించలేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుండటం విశేషం.

నేటి పాదయాత్ర షెడ్యూల్...

ఇక జగన్ 44వ రోజు పాదయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు కదిరి నియోజకవర్గం లోని గాండ్లపెంట నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్ రోడ్స్, తాళ్ల కాల్వ, రెక్కమాను మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అక్కడి నుంచి గాజులవారి పల్లెకు చేరుకుంటుంది. తర్వాత చామలగొంది క్రాస్ రోడ్స్ నుంచి ధనియనని చెరువుకు చేరుకుని అక్కడ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత ఎస్.పి కుంటలోని ధనియని చెరువులో జగన్ భోజనవిరామానికి ఆగుతారు. తర్వాత డి.కొత్తపల్లి, కొట్టాల వారిపేట మీదుగా బండారు చెట్లుపల్లికి యాత్ర చేరుకోనుంది. వెంకమద్ది క్రాస్ రోడ్స్ లో జగన్ పాదయాత్ర ముగియనుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు.

Similar News