వలసవచ్చిన నేతలతో టిఆర్ఎస్ కారు ఎప్పుడో నిండి పోయింది. ఇంకా కొత్తవారికి కూడా వల విసురుతున్న నేపథ్యంలో కారులో సీట్లు లేని పరిస్థితి. దాంతో కేంద్రాన్ని నియోజకవర్గాల పునర్విభజన చేయండి బాబోయి అంటూ లేఖలు రాసి రాసి లాభం లేదని కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలు పెట్టారు టి ఎంపీలు. ఏపీ సీఎం, టి సీఎం ఏకాభిప్రాయంతో వున్న ఏకైక అంశం నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే కావడం గమనార్హం. దానికోసం ఇద్దరు సీఎం లు రాజ్ నాధ్ తో పలుసార్లు ములాఖత్ అయ్యారు కూడా.
ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసిన కేసీఆర్...
కేంద్రాన్ని పని అయ్యేదాకా సలుపుతూనే వుండాలని భావించిన టి సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎంపి వినోద్ తో టీం ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇప్పటికే పలుసార్లు కేంద్ర హోమ్ మంత్రికి విభజన చట్టం అమలు చేయండి అంటూ లేఖలు రాసింది. ఇక లాభం లేదని నేరుగా రాజ్ నాధ్ ను కలిసి వినోద్, జితేంద్ర రెడ్డి భేటీ కూడా అయ్యారు. ఈ శీతాకాల సమావేశాల్లో నియోజకవర్గ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. గతంలో నియోజకవర్గాల పెంపు లేనేలేదని ఢిల్లీ లో ప్రధాని మోడీని, హోమ్ మంత్రి రాజ్ నాధ్ ను కలిసిన తరువాత కేసీఆర్ ప్రకటించారు. అది తమ ప్రాధాన్యతే కాదన్నారు.
మాట మార్చిన కేసీఆర్ ....
టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం తెలంగాణ టిడిపి చెల్లా చెదురు కావడంతో కేసీఆర్ తన కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. అలాగే తన పాత మాటను ఆయనే ఖండిస్తూ నియోజకవర్గాల పెంపు ఖచ్చితంగా ఉంటుందని ప్రకటించారు. అనాధలుగా మిగిలిన టి టిడిపి నేతలకు అసంతృప్త కాంగ్రెస్ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ తో అక్కున చేర్చుకునే కార్యక్రమం పెద్ద ఎత్తునే ప్రారంభించారు. అలా వచ్చే వారికి, వస్తే మాకేంటి అన్నవారికి టికెట్ ఆఫర్ ఇవ్వలిసి వస్తుంది . ఈ నేపథ్యంలో పోరాడి అయినా పునర్విభజన చట్టంలో వున్న క్లాజ్ లను ప్రస్తావిస్తూ నియోజకవర్గాల పెంపు చేయడానికి కేసీఆర్ తలక్రిందుల తపస్సు చేయక తప్పడం లేదు. మరి మోడీ సర్కార్ కరుణిస్తుందో లేదో చూడాలి.