బాబులో ఇక సహనం నశించినట్లేనా?

Update: 2018-02-01 12:30 GMT

కేంద్ర బడ్జెట్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజిత రాష్ట్రం పట్ల కేంద్రం మరోసారి అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అందుబాటులో ఉన్న పార్లమెంటు సభ్యులతో అత్యవసర సమావేశం ఏర్పాుట చేశారు. అమరావతి నుంచే పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎదుట ఎంపీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎన్నిమార్లు ఢిల్లీ చుట్టూ ప్రదిక్షిణలు చేసి వినతులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని చంద్రబాబు ఎంపీల ఎదుట బాధను వ్యక్తం చేశారు.

రాజీనామా చేద్దామని....

కొందరు ఎంపీలు ఈ సందర్భంగా రాజీనామా చేద్దామని కూడా అభిప్రాయపడ్డారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వస్తుంటే అలుసుగా తీసుకుంటుందని, రాజీనామా చేయడమే మంచిదన్న అభిప్రాయానికి కొందరు ఎంపీలు వ్యకత్ం చేశారు. మరికొందరు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించుదామని, అందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. కొంత సహనం పాటించాలని, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ వేచి చూద్దామని, అప్పటికీ రాష్ట్రానికి మేలు జరగకుంటే అప్పుడు ఆలోచిద్దామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది.

ఆదివారం కీలక నిర్ణయం....

చంద్రబాబు నేరుగా కేంద్రమంత్రి సుజనా చౌదరితో మాట్లాడారు. బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావన లేకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఊసే లేకపోవడం పై ఆరా తీశారు. అయితే సుజనా చౌదరి కూడా చేతులెత్తేసినట్లు సమచారం. దీంతో ఆదివారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం తో భవిష్యత్తులో ఎలా మెలగాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కనీసం ఈబడ్టెట్ లోనైనా రాష్ట్రానికి నిధులువస్తాయని చంద్రబాబు ఆశించారు. విభజన హామీల మీద స్పష్టత వస్తుందనుకున్నారు. కాని అలాంటిదేమీ లేకపోవడంతో చంద్రబాబు బీజేపీతో మైత్రిపై ఆలోచనలో పడినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Similar News