వైసిపి అధినేత జగన్ రాజకీయాల్లో రాటుదేలారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై విపక్ష నేత ప్రజలకు సరికొత్త తరహాలో వివరించే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. బడ్జెట్ లో టిడిపి వైఫల్యాన్ని అరటిపండు వలిచినట్లు ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అవుతున్నారు జగన్. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నారు. ఇది బిజెపి ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదు. ఎన్డీయే ప్రవేశపెట్టింది. అందులో భాగస్వామి తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ కి చెందిన మంత్రులు కేబినెట్ లో ఉన్నారు. బడ్జెట్ లో ప్రవేశపెట్టే అంశాలు కేబినెట్ ఆమోదం పొందిన తరువాతే పార్లమెంట్లో ప్రవేశపెడతారు. కేబినెట్ లో తమ అసంతృప్తి వ్యక్తం చేయని టిడిపి ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీసిందని జగన్ తన పాదయాత్రలో గట్టిగా ఎండగట్టేస్తున్నారు.
టిడిపి తప్పులవల్లే ...
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ విషయంలో వైఫల్యం చెందిందని వైసిపి అధినేత దుమ్మెత్తి పోస్తున్నారు. బాబు నిరుద్యోగులను ఇలాగే మోసం చేశారని ఆరోపించారు జగన్. బాబు వస్తే జాబు అన్నారు. ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలిసిందే అంటూ తనదైన శైలిలో దాడి మొదలు పెట్టారు వైసిపి అధినేత. ఇప్పుడు ప్రతి గ్రామంలో మద్యం షాప్ ఉందని, ఫోన్ కొడితే మద్యం ఇంటికే టిడిపి సర్కార్ పంపిస్తుందని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఆడే వారికి ఓట్లు వేసి మోసపోవొద్దన్నారు జగన్.
చంద్రబాబు లక్ష్యం గానే జగన్ విమర్శలు ...
ఏపీకి అన్యాయం కేవలం చంద్రబాబు వల్లే జరిగిందన్నది ప్రజలకు వివరించాలని వైసిపి అధినేత క్యాడర్ కి దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఓటుకు నోటు తో రాష్ట్రానికి చేటు వచ్చిందన్నది వివరంగా చెప్పాలన్నది వైసిపి ఆలోచన. కేంద్ర బడ్జెట్ లో నిధుల మొండి చెయ్యి అన్నది టిడిపి మరోసారి ఆడుతున్న నాటకమని ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ వ్యూహమన్నది తేటతెల్లం చెయ్యాలని వారి మాయలో పడకుండా అందరిని చైతన్యం చేయాలన్న వైసిపి వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.