కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు పోలవరం నిర్మాణ ఖర్చులు పూర్తిగా కేంద్రమే భరించాలని వేసిన వ్యాజ్యం రాష్ట్రానికి వరం అని విశ్లేషించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్. కెవిపి వేసిన కేసులో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కు అయ్యే మొత్తం సవరించిన అంచనాలకు అనుగుణంగా కేంద్రం చెల్లించాలని కోర్టు లో అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం రేపటి తో పూర్తి అవుతుందని అయినా ఏపీ సర్కార్ వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నలు సంధించారు ఉండవల్లి.
నాణ్యత లోపాలపై చంద్రబాబు కి లేఖ ...
పోలవరం నిర్మాణ పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను ఉండవల్లి అరుణ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి లేఖ రూపంలో ఈ మెయిల్ చేశారు. తక్షణం సీఎం దీనిపై దృష్టిపెట్టి నాణ్యతతో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేగవంతంగా పనులు జరగాలనే తొందరలో నాణ్యత లేని నిర్మాణాలు చేస్తే గోదావరి జిల్లాలకు అత్యంత ప్రమాదమని హెచ్చరించారు ఉండవల్లి.
ఎఫ్ డి ఆర్ ఐ బిల్లు అడ్డుకోండి ...
దేశానికి తీరని ద్రోహాన్ని పేదలకు శాపంగా మారే ప్రమాదకర బిల్లు ఎఫ్ డి ఆర్ ఐ ని రాష్ట్ర ఎంపీలు 25 మంది అడ్డుకోవాలని ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు చట్టం అయితే పేదల సొమ్ములకు బ్యాంక్ ల్లో భద్రత నిల్ అన్నారు అరుణ కుమార్. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ లో రాష్ట్రానికి చెందిన గల్లా జయదేవ్ వున్నారని ఆయన తీవ్రంగా ప్రతిఘటించాలని కోరారు. బిల్లు చట్టం అయితే దేశ ఆర్ధిక వ్యవస్థే గందరగోళం లో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఉండవల్లి.
హెరిటేజ్ వ్యాపార విస్తరణే విలేజ్ మాల్స్ ...
బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరల్లో వున్న సరుకులను విలేజ్ మాల్స్ పేరుతో రిలయన్స్ హెరిటేజ్ బిగ్ బజార్ అధిక ధరలకు విక్రయించి పేదల సొమ్ము గుంజేసే కార్యక్రమం ఏపీలో ప్రారంభం కావడం దారుణమన్నారు అరుణ కుమార్. రేషన్ దుకాణాల స్థానంలో వీటిని ప్రవేశ పెట్టి తాను తన భాగస్వాములు లబ్ది పొందడానికే పెద్ద కుట్రతో వీటిని ప్రజల్లోకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. పేదవారి ఆదాయం ఈదేశంలో రూపాయికి 68 పైసలు ఇప్పటికే పన్నుల రూపంలో గుంజేస్తున్నారని ఇలాంటి మాల్స్ ద్వారా ప్రభుత్వం లో వున్నవారే వ్యాపారాలు చేసి వారి జీవన స్థితి ని ఆర్ధిక పరిస్థితి ని మరింత దిగజార్చి అప్పుల ఊబిలో పడేస్తారని హెచ్చరించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్.