రాజకీయాల్లో పట్టణాలు, నగరాలకు ఉన్న ప్రాధాన్యం కంటే గ్రామాల్లో ఉండే కట్టుబాట్లు డిఫరెంట్‌గా ఉంటాయి. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎన్నికల సమయంలో కుదిరితే ఓటేస్తారు. లేకపోతే.. ముసుగుతన్ని పడుకుంటారు! కానీ, గ్రామీణుల పరిస్థితి అలా ఉండదు. వారికి ఓటు అంటే ఓ ప్రత్యేక మైన గౌరవం, ఓటు వేయకపోతే, వేలిపై సిరా చుక్క పడకపోతే.. నామూషీగా కూడా ఫీలవుతారు. అంతేకాదు, రాజకీయంగా కూడా గ్రామీణులు చైతన్యంగానే ఉంటారు. వాస్తవానికి పాఠ్యాంశాలకు సంబంధించిన నాలెడ్జ్ కొంత మేరకు కొరవడినా.. రాజకీయ అంశాలపై వారికి మంచి పట్టుంది. ఈ క్రమంలోనే ప్రతి రాజకీయ పార్టీ కూడా గ్రామీణ ఓటర్లను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
బాబు... జన్మభూమి....
ఈ క్రమంలోనే ఇటు ఏపీ, అటు తెలంగాణ అధికార పార్టీలు రెండూ గ్రామీణ భారతాన్ని ప్రభావితం చేసేలా, గ్రామీణ ఓట్లు కొల్లగొట్టేలా ప్లాన్ చేసుకున్నాయి. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్న ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్‌లు ఆదిశగా ఇప్పటికే సగం ప్లాన్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గ్రామీణులకు వల వేసేందుకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇక, ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ఇలా ఆయన గ్రామీణుల్లో టీడీపీ జెండా పై మక్కువ పెరిగేలా చేసుకున్నారు. అయితే, ఇతమిత్థంగా గ్రామీణులు అందరూ టీడీపీవైపు మొగ్గుతారనే ప్రచారం మాత్రం జరగలేదు. దీంతో బాబుకు ఇంత ఖర్చు చేసి, అధికారులను, నేతలను గ్రామాల్లోకి పంపినా ఈసురోమనే ఫలితం దక్కింది.
అధికార పార్టీకి వరంగా.....
ఇక, ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన ఎత్తుగడ భారీఎత్తున పారుతోంది. వచ్చే ఎన్నికల నాటికి గ్రామాల్లో టీఆర్ఎస్ కారుతప్ప మరే గుర్తూ కనిపించే అవకాశం లేకుండా ఆయన చేశారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థను సమూలంగా మార్పు చేసేందుకు ఆయన నిర్ణయించి ఇప్పటికే ఐదుగురు మంత్రులతో కమిటీ వేశారు. ఫలితంగా పంచాయతీలపై కేసీఆర్‌కు పట్టు పెరిగింది. తాజా సిఫారసులు అమలైతే.. కొత్తగా 4 వేల పంచాయతీలు. అందులో 2 వేలు తండాలు ఏర్పాటు అవుతాయి. 300 జనాభా ఉన్నా తండా పంచాయతీలుగా అవకాశం, గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల నియామకం ఉంటుంది. కో ఆప్షన్ సభ్యులుగా ముగ్గురు, ఒకరు ఎన్నారై? ఉంటారు. ఇక, ప్రస్తుతం ఉన్న సభ్యుల కాలపరిమితి.. ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెరగనుంది. ఫలితంగా అధికార పార్టీకి ఈ మార్పులు వరంగా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.