బాబును ఉతికి పారేసిన పవన్

Update: 2018-03-14 14:36 GMT

తెలుగుదేశం ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఉతికి ఆరేశారు. అవినీతి ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. చివరకు లోకేష్ ను కూడా పవన్ వదల్లేదు. చంద్రబాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వబోవమని తేల్చి చెప్పారు. రేపటి నుంచి టీడీపీ అవినీతిని ఎండగటట్టడమే జనసేన లక్ష్యమన్నారు. దాదాపు రెండుగంటల పవన్ ప్రసంగం చంద్రబాబును టార్గెట్ చేస్తూ కొనసాగింది. తెలుగుదేశం పార్టీకి తాను మద్దతిచ్చింది ఏపీ అభివృద్దికోసమేనని పవన్ చెప్పారు. ఆయన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో పయనిస్తుందని భావించానన్నారు. కాని టీడీపీ ఈ నాలుగేళ్లలో ఆరు మాటలు మాట్లాడితే అందులో మూడు అబద్ధాలేనని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబును కలిసినప్పుడు పదిహేను వందల కోట్లతో రాజధాని వస్తుందని తనతో చెప్పారని, కాని ఇప్పుడు లెక్కలు మారాయన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు. టీడీపీ పాలనలో అభివృద్ధి కేవలం ఒక ప్రాంతానికే పరిమితమయిందన్నారు.

చీకటి ఒప్పందమే....

ప్రత్యేకహోదా ఇవ్వనని కేంద్రం చెప్పినప్పుడు కేంద్రప్రభుత్వంతో ప్రత్యేక ప్యాకేజీతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. ఆ ప్యాకేజీకి చట్టబద్ధతను కల్పిస్తారని చంద్రబాబు అనంతపురంలో చెప్పారని, కాని ఈరోజుచట్టబద్ధత లేదని వాళ్లే చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు తెలివి లేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నిశ్శబ్దాన్ని చేతకాని తనంగా చూడొద్దొన్నారు. ఇప్పుడు మళ్లీ గవర్నర్ చేత ప్రత్యేక హోదా కావాలని చదివించారన్నారు. ఆ మాట నాలుగేళ్ల క్రితమే చెప్పొచ్చు కదా? అని నిలదీశారు. అన్ని సాధించిన టీడీపీ ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయిందన్నారు. ప్రభుత్వ ఆత్మగౌరవంతో ఆటలాడుకున్నారన్నారు. పోలవరాన్ని ప్రయివేటు కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నం ప్రత్యేక హోదాకు ఎందుకు చేయలేదన్నారు. వైసీపీనేతలు బలంగా పోరాడతారనుకుంటే వాళ్లు అసెంబ్లీకి రారని, వాళ్లకు చిత్తశుద్ధి లేదన్నారు. టీవీల్లోకూడా వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడలేరని, మీరు తనమీద ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి రావాలని జగన్ కోరుకుంటున్నారన్నారు.

లోకేష్ అవినీతి కనపడలేదా?

అసెంబ్లీ లో కూర్చుని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారని, గుంటూరులో కలరా వచ్చి చచ్చిపోతే మీకు బాధలేదా? శ్రీకాకుళంలో పసిపిల్లలు చనిపోతుంటే బాధ కలగలేదా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. స్కామ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉండాలంటే తమకు ఓటెయ్యాలని మోడీ ఆనాడు చెప్పారని, అయితే ఇప్పుడు స్కామ్ ఆంధ్రా చేయలేదు కాని కరప్షన్ ఆంధ్ర చేశారన్నారు. లోకేష్ పెద్ద అవినీతిపరుడన్నారు. లోకేష్ అవినీతి చంద్రబాబు దృష్టికివచ్చిందో లేదో తెలియదన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తమతో కలిసి ఉంటాడో లేదో తెలియదు కాని జగన్ ను ఎదుర్కొనాలంటే అవినీతి చేయక తప్పదని టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారన్నారు. ఎన్టీఆర్ మనువడు ఏంచేస్తున్నాడో మీకు తెలుసా? ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి ప్రజలకు టీడీపీ ద్రోహం చేసిందన్నారు. ఇంత అవినీతి ఉంటే ఎందుకు వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాలని ప్రశ్నించారు.

కలబొల్లి కబుర్లు చెబతున్న బాబు...

ఇది 80, 90వ దశకం కాదని, సరికొత్త రాజకీయ శకం వచ్చిందన్నారు. ఈరోజు నుంచి తెలుగుదేశం వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి ఇసుక మాఫియాకు అండగా నిలబడ్డారన్నారు. ఎర్రచందనం అమ్మితే ఆడబ్బుతో రాజధాని కట్టొచ్చని ముఖ్యమంత్రి చెప్పారని, కాని ఇప్పుడు పదిహేను వందల కోట్లు కూడా రాలేదంటున్నారన్నారు. ఎందుకీ కల్లబొ్ల్లి కబుర్లు చెబుతారన్నారు. ఆక్వా పార్కుకు ఎందుకు అనుమతిచ్చారన్నారు. పర్యావరణాన్ని నాశనం చేసే ఆక్వా ఫ్యాక్టరీకి ఏపీ సర్కార్ మాత్రం ఎందుకు మద్దతిచ్చిందో అందరికీ తెలుసన్నారు. నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఎలా దాడిచేస్తారన్నారు. దాడి చేసిన ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకున్నారు. సహనానికి కూడా హద్దుంటుందన్నారు.

సింగపూర్ తరహా పాలన ఏదీ?

సింగపూర్ తరహా రాజధాని చేయాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి ముఖ్యమంత్రిగారూ అని పవన్ ఎద్దేవా చేశారు. సింగపూర్ లో సర్కార్ ఎలా పనిచేస్తుందో తెలుసా? అని ప్రశ్నించారు. అదే సింగపూర్ లో అధికారిపై దాడి చేసుంటే అక్కడ తోలు ఊడిపోయేలా కొట్టేవారన్నారు. దాడిచేసిన ఎమ్మెల్యేను మీరు రక్షిస్తారా? అని నిలదీశారు. ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలున్నాయన్నారు. ఆరేళ్లలో 75 కోట్లు సంపాదించానని, పాతికకోట్లు పన్ను చెల్లించానని చెప్పారు. ఇసుక మాఫియాకు అండగా నిలిస్తే భూమాత భూమిలోకి లాక్కెళ్లిపోతుందన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు. ఇప్పటికీ ఉద్దానం సమస్య పరిష్కారం కాలేదన్నారు. చేయాల్సింది అక్కడ కొండంత ఉందన్నారు. అభివృద్ది అంటే కొందరికి కాదని, అవకాశాలు కొందరికి కాదని, అధికారం కొందరికి కాదని అందరికీ చెప్పారు. రాయలసీమ వెనకబాటు తనానికి ఎవరు కారణమన్నారు.

ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వంది....

ఇన్ని సమస్యలు ఉంటే 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని పదే పదే చెబుతున్నారని, ప్రధాని ఏం చేస్తారని, మన బంగారం మంచిదైతే కదా? శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ ఉన్నాడని, అందుకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అంటున్నారని సెటైర్ వేశారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో తెలపాలన్నారు. మూడు మాటలు మాట్లాడితే ఆరు అబద్ధాలుగా అనిపిస్తుంటే, లక్షకోట్ల బడ్జెట్ అంటే ఎలా నమ్ముతారన్నారు. ప్రజలను బుద్ధి లేని వాళ్లనుకుంటున్నారా? అని అన్నారు. చంద్రబాబు మీద అనేక అభియోగాలొచ్చాయన్నారు. ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు తాను మాట్లాడంది కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికేనన్నారు. గాలి జనార్థన్ రెడ్డి చేసింది తప్పన్నారు...మీరు ఇసుక మాఫియా చేస్తుండటం తప్పుకాదా? అని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికీ మీ బుద్ధులు, పద్ధతులు మారలేదన్నారు. టీడీపీ నేతలు తెలుగుతల్లికి ద్రోహం చేశారన్నారు. వైసీపీ వస్తే దోపిడీ పెరుగుతుందని చెప్పి అధికారంలోకి వచ్చి మీరూ అదే చేస్తారా? అని అన్నారు.

దోపిడీకి కేరాఫ్ టీడీపీ...

విశాఖలో స్థలాలను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నా పట్టించుకోరా? తవ్వేకొద్దీ టీడీపీ అవినీతి బయటకు వస్తుందన్నారు. దీనికి అంతులేదా? అని ఆయన ప్రశ్నించారు. నేటి నుంచి టీడీపీ సర్కార్ పై జనసేన పోరాటానికి సిద్ధమవుతుందన్నారు. పోరాటం చేస్తే పోయేదేమీ లేదన్నారు. విజయవాడ కనకదుర్గ గుడి వద్ద పార్కింగ్ సొమ్ము కూడా ఎమ్మెల్యేకు వెళ్లాలంటే ఎంత అవినీతి జరుగుతుందో చెప్పనవసరం లేదన్నారు. భక్తులను కూడా దోచేస్తున్నారన్నారు. కాపు రిజర్వేషన్లు అని చెప్పి మభ్యపెట్టారన్నారు. చేయలేమని తెలిసి కూడా కులాల మధ్య చిచ్చుపెట్టారన్నారు. సమాజం విచ్చిన్నమవదా? అని ప్రశ్నించారు.అధికారంలోకి రాకపోతే మీరు హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన ఇంట్లో ఉంటారని, ప్రజలు ఇబ్బంది పడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సింగపూర్ అంటే ఎత్తైన భవనాలు కాదని, ప్రజలు ఆనందంగా ఉండాలని హితవు పలికారు. తాను రాజకీయాన్ని కోరుకున్నది కాదని, వచ్చిందని తెలిపారు. ఎక్కడ ఉన్నా పవన్ కల్యాణ్ గుండె ప్రజల కోసం కొట్టుకుంటుందన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలను అడుగుతున్నానని, జనసేన చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తుందీ? లేనిదీ? జగన్ ఇప్పుడు చెప్పాలన్నారు. ప్రధాని వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఎలా అపాయింట్ మెంట్ ఇస్తారన్నారు. ఆ రహస్యాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకుని ఎన్నికల్లో మాత్రం జనసేనకు ఓటేమయమి పిలుపునిచ్చారు. జనసేన మ్యానిఫేస్టోను ఆగస్టు 14న విడుదల చేస్తామన్నారు.

Similar News