తెలంగాణలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన తూళ్ల దేవేందర్ గౌడ్.. కేంద్రంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే, రానురాను తెలంగాణలో టీడీపీ బక్కచిక్కి పోతుండడం, నేతలు ఎవరికివారే తమ తమ దారులు మార్చుకుంటుండడంతో దేవేందర్ గౌడ్ కూడా తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే, అధికార టీఆర్ ఎస్‌లోకి వెళ్లకుండా ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తుండడం గమనార్హం. దీనికి సంబంధించి అన్ని చర్చలు కూడా ముగిశాయని సమాచారం. ఇదే సమయంలో రెండు రోజుల కిందట మాల్దీవులకు వెళ్లిన చంద్రబాబుకు కూడా ఈ విషయం చెప్పినట్టు తెలిసింది.
ఎన్టీఆర్ హయాం నుంచి...
ఇక, విషయంలోకి వెళ్తే.. ఉమ్మడి రాష్ట్రంలో అన్నగారు ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో పార్టీలో చేరిన దేవేందర్ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గం నుంచి పలు మార్లు గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలోనే మంత్రివర్గంలో చేరిన దేవేందర్ గౌడ్.. ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనూ అత్యంత కీలకమైన బీసీ సంక్షేమం, హోం శాఖలకూ ఆయన మంత్రిగా ఉన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఆయన టీడీపీకి రాంరాం చెప్పి .. సొంతంగా నవ తెలంగాణ ప్రజాపార్టీ పేరుతో కొత్తదానిని స్థాపించారు. అయితే, అది విఫలం కావడంతో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో ఆయన రాజకీయాలకు కొద్ది కాలం పాటు దూరంగా ఉన్నారు. అయితే, ఇటీవల మళ్లీ టీడీపీలో చేరి రాజ్యసభ సీటును సంపాయించుకున్నారు.
క్రియాశీల రాజకీయాలకు దూరంగా...
నిజానికి ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెద్ద కుమారుడు వీరేందర్ గౌడ్ భవిష్యత్తు కోసం ఇప్పుడు దేవేందర్ గౌడ్ పార్టీ మార్పు నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీడీపీ బలహీనపడడం, రాబోయే రోజుల్లో పార్టీ కి జెండా పట్టుకునే రేంజ్‌లోనూ నేతలు లేకపోవడంతో పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావించిన దేవేందర్ గౌడ్‌కు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందిందని సమాచారం. అదేసమయంలో బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్టు తెలిసింది. అయితే, బీజేపీలో కేడర్ లేదని, ఇప్పటికే అక్కడ ఉన్న మాజీ టీడీపీ నేత, మంత్రి నాగం జనార్ధన రెడ్డి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది.
కుమారుడి భవిష్యత్ కోసమే...
దీంతో దేవేందర్ గౌడ్ తన రూటు మార్చుకుని కాంగ్రెస్‌లోకి చేరాలని భావిస్తున్నారట. ఇదే జరిగితే.. ఆయన తన కుమారుడికి రాజకీయంగా భవిష్యత్తు బాగుండేలా చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇదిలావుంటే, తన తండ్రి పార్టీ మార్పుపై దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ తాజాగామీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. టీడీపీలోనే కొనసాగుతారని ప్రకటించారు. అయితే తెలంగాణలో పార్టీ మారిన టీడీపీ నాయకులు అందరూ ఇదే మాట చెప్పి, ఆ వెంటనే పార్టీ కండువా మార్చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం సస్పెన్స్ గా మారింది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.