బాబుకు షాకింగ్ న్యూస్...ఇలాగైతే ఎలా?

Update: 2017-12-23 09:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాలకు గ్రేడ్లు కేటాయిస్తున్నారు. ప్రజలు 80 శాతం మంది పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబుకు నియోజకవర్గాల వారీగా చూస్తే మాత్రం కంగారు పుడుతోంది. నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జుల ఉన్న చోట పరిస్థితి బాగా లేదన్న విషయం అర్థమయింది. మాల్దీవుల నుంచి వచ్చిన చంద్రబాబు నియోజకవర్గాల గ్రేడింగ్ పై దృష్టిపెట్టారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అనేక నియోజకవర్గాలు‘సి’ గ్రేడ్ లో ఉండటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఎక్కువ నియోజకవర్గాలు ‘సి’ గ్రేడ్...

ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు బాగా పనిచేస్తున్న నియోజకవర్గాల్లో ప్రజాసమస్యలు సత్వరం పరిష్కారమవుతున్నాయి. నిధుల అవసరం లేని పనులను వీరు వేగిరం చేస్తున్నారు. నిధుల అవసరం ఉన్న వాటిపై కూడా వీరు ప్రత్యేకంగా దృష్టిపెట్టి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి మరీ నిధులను విడుదల చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో ‘ఎ’ గ్రేడ్ నియోజకవర్గాలు 30కి మించలేదు. అలాంటి నియోజకవర్గాలకు ‘ఎ’ గ్రేడ్ ఇస్తున్నారు. ఇక పరవాలేదు అన్న నియోజకవర్గాలుకు ‘బి’ గ్రేడ్ ఇస్తున్నారు. ఇవి కూడా రాష్ట్రంలో దాదాపు 60 నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిసింది. ఇక మిగిలిన 85 నియోజకవర్గాలు ‘సి’ గ్రేడ్ లో ఉన్నాయి. సి గ్రేడ్ లో ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు అస్సలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు సర్వేలో తేలింది.

ఇన్ ఛార్జులను మార్చాలన్న యోచనలో....

ఏ, బీ కన్నా సీ గ్రేడ్ ఉన్న నియోజకవర్గాలే రాష్ట్రంలో ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు వాటిపై దృష్టిపెట్టాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రులను ఆదేశించారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఎక్కువ నియోజకవర్గాల్లో సి గ్రేడ్ వచ్చినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గాల్లో సయితం వైసీపీ నుంచి వచ్చి చేరిన దాదాపు 20 నియోజకవర్గాలు ఉన్నట్లు తేలింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను స్థానిక నేతలను కలుపుకుని పోకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు గుర్తించారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను మార్చాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు. కొత్తవారికి అవకాశం ఇస్తే అందరినీ కలుపుకుని పోతారని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద ఎక్కువ నియోజకవర్గాలు ‘సి’ గ్రేడ్ రావడం చంద్రబాబుకు మింగుడు పడని విషయమే. దీనిపై త్వరలోనే ఇన్ ఛార్జి మంత్రులతో మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Similar News