అవును! అధికార పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు తన మానస పుత్రిక, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన్మభూమి కార్యక్రమం తాజాగా సెగ పుట్టిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలపై ఎన్నికల వరాలను ఇప్పటి నుంచే కురిపించాలని చంద్రబాబు భావించారు. దీనికి తగిన విధంగా అన్నీ పక్కా ప్లాన్ చేసుకున్నారు. అడిగిన వారికి అడిగినట్టుగా రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆయన జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అడగకపోతేనే పాపం అనే రేంజ్‌లో వీటిని తీర్చి దిద్దారు కూడా! ఇక, పక్కా ఇళ్ల విషయంలోనూ ఇదే తీరుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11వ తారీకు వరకు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని బాబు భావించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను, అధికారులను ఆయన అలెర్ట్ చేశారు కూడా.
బాబు ఒకటి తలిస్తే.....
ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై మార్కులు కూడా వేయాలని బాబు భావిస్తున్నారని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, బాబు ఒకటి తలిస్తే.. జనాలు మరొకటి తలిచారు. జన్మభూమి విజయవంతం అవుతుందని భావించిన చంద్రబాబుకు చాలా చోట్ల జనాలు ఝలక్ ఇచ్చారు. పలు జిల్లాల్లో జనాలు జన్మభూమి నిర్వహణకు అడ్డు తగిలితే.. మరికొన్ని చోట్ల పూర్తిగా బాయ్‌కాట్ చేశారు. టీడీపీకి మంచి పట్టున్నదని చెబుతున్న అనంతపురంలోనే జన్మభూమిని ప్రజలు బహిష్కరించడం చర్చకు దారితీసింది. ఇక్కడి సోమందేవపల్లిలో నిర్వహించిన జన్మభూమిని ప్రజలు తిరస్కరించారు. నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపై భైటాయించారు. నేతలు చెబుతున్నది ఒక్కటి, చేస్తోంది మరొకటి అంటూ వ్యాఖ్యలు సంధించారు.
ఎన్నో సమస్యలు....
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులుప్పాడ పంచాయతీ పరిధిలో జన్మభూమి కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇలా మొదలైందో లేదో .. వెంటనే ప్రజల నుంచి నిరసన జ్వాలలు రేగాయి. తమకు రేషన్ అందడం లేదని, పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గొన్న కార్యక్రమంలోనూ ఇదే తరహా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏజెన్సీలో కనీసం తాగేందుకు గుక్కెడు నీటికి కూడా కరువైపోయిందని, వైద్యం ఎక్కడని గిరిజనులు ఆమెను వారి భాషలోనే ప్రశ్నించడంతో అధికారులు ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డారు. అర్హులను పట్టించుకోకుండా.. కేవలం టీడీపీ జెండా మోస్తున్న వారికే అన్నీ అన్నట్టుగా యంత్రాంగం వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.
పక్కా ఇళ్లకోసం....
నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రజలు పక్కా ఇళ్లకోసం నిలదీశారు. ఇక, రైతులు కూడా జన్మభూమి వేదికగా అధికార పార్టీని ఇరుకున పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రైతులు రుణమాఫీపై ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను నిలదీయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పాతనౌపడలో నిర్వహించిన కార్యక్రమంలో తమకు ఇళ్లు రావడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కొందరిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడడం మొత్తం కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించింది. సో.. ఇలా.. చంద్రబాబు ప్రారంభించి, ప్రతిష్టాత్మకంగా భావించిన జన్మభూమి కార్యక్రమం ఆసాంతం నిన్న విమర్శలకుదారి తీయడం టీడీపీ వర్గాలను కలచి వేసింది. ఇక, ఇదే క్రమంలో రంగంలోకి దిగిన వైసీపీ నేతలు చంద్రబాబు చెబుతున్న 80% ప్రజల సంతృప్తి ఇదేనా? అని ప్రశ్నల వర్షం కురిపించడం కొసమెరుపు!