బాబుకు జగన్ వేసిన సూటి ప్రశ్నలివే....!

Update: 2018-02-04 01:30 GMT

జగన్ పాదయత్ర నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్ చంద్రబాబుకు సూటి ప్రశ్నలు వేశారు. మూడు సంవత్సరాల 11నెలలు ప్రధాని మోడీని పొగడటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, అయితే బడ్జెట్ తర్వాత కేంద్రప్రభుత్వం తీరుపై చంద్రబాబు బాధపడుతున్నారని మీడియాకు లీకులిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేంది మోడీ కాదని, ఎన్డీయే ఫ్రభుత్వమని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రులు బడ్జెట్ పై కేబినెట్ ఆమోదం తెలుపుతున్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు చేతకాని తనవల్లనే ఏపీకి నిధులు రాకుండా పోయాయయన్నారు.

ఇది మొదటిది కాదు... చివరిది....

చంద్రబాబు కేవలం తన కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి మద్దతు తెలుపుతున్నారన్న జగన్.. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఐదోదన్న విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబుకు ఏపీకి జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ఎన్డీఏ పాలనలో చంద్రబాబు భాగస్వామి అని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే అందులో చంద్రబాబుకు కూడా వాటా ఉందని విమర్శించారు. నెల్లూరుజిల్లా సౌత్ మోపూరు బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. జగన్ బహిరంగ సభకు వేలాది మంది జనం తరలి వచ్చారు. చంద్రబాబు నెల్లూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రజలనే అడిగారు. పెట్రోలు ధరలు ఏపీలో మండిపోతున్నాయని, సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడని ఆవేదన చెందారు. అదే పొరుగున ఉన్న తమిళనాడుకు వెళితే ఏడు రూపాయలు, కర్ణాటకకు వెళితే ఆరు రూపాయలు పెట్రోలు ధర తక్కువగా ఉందని, ఇక్కడ మాత్రం పన్నుల పేరుతో జనాన్ని చంద్రబాబు పిండేస్తున్నారని విమర్శించారు.

నేరం మరొకరిపై నెట్టేయడానికే.....

ఏడాదిలో ఎన్నికలు జరుగతున్నాయని ఎవరిపైనో నిందలు వేసి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ మొదటిది కాదని చివరిదని ఆయన వ్యంగంగా అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ప్రజల దగ్గరకు వెళ్లలేక అభివృద్ధి జరగకపోవడానికి కేంద్రమే కారణమని చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నారన్నారు. చంద్రబాబును మించిన మోసగాడు మరొకరు ఉండరని, పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర చంద్రబాబుదని ఆయన ఘాటు విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.

నేటి పాదయాత్ర షెడ్యూల్.....

వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర 79వ రోజుకు చేరుకుంది. ఆయన ఆదివారం సౌత్ మోపూరు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సౌత్ మోపూరు గిరిజన కాలనీ, ములుమూడి, స్పందన క్రాస్ రోడ్స్, కొమ్మరపూడి క్రాస్ రోడ్స్ కు చేరుకుంటారు. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. తర్వాత దేవరపాలెం ఎంట్రన్స్ మీదుగా దేవరపాలెం చేరుకుంటారు. జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. నిన్న జగన్ మొత్తం 12 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రకు జనం పోటెత్తుతుండటంతో జగన్ పాదయాత్ర నెమ్మదిగా సాగుతోంది.

Similar News