ఏపీ డీజీపీ నియామకం విషయంలో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతోంది. సాక్షాత్తూ హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ జోక్యంతోనే ఏపీ డీజీపీ సాంబశివరావుకు డీజీపీగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారి లాబీయింగ్ చేయడంతోనే యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు జాబితాలను వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. ఏపీ ఇన్ ఛార్జి డీజీపీ సాంబశివరావు పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. అయితే పూర్తికాలం డీజీపీగా నియమించాలంటే కనీసం రెండేళ్ల సర్వీస్ ఉండాలి. కాని ఏపీ ప్రభుత్వం పంపిన జాబితాాలో కేవలం ఆరు నెలల సర్వీస్ ఉన్నవారే ఎక్కవుగా ఉండటంతో యూపీఎస్సీ జాబితాను వెనక్కు పంపింది. కాని ప్రభుత్వం మాత్రం ఏపీ డీజీపీగా నండూరి సాంబశివరావునే కొనసాగించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
ఢిల్లీలో ఐపీఎస్ లాబీయింగ్....
ఈనేపథ్యంలోనే ప్రస్తుతం ఇన్ ఛార్జి డీజీపీగా ఉన్న సాంబశివరావును పూర్తి కాలం డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నండూరి సాంబశివరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, కొన్ని సున్నితమైన సమస్యలను చాకచక్యంగా డీల్ చేయడంతో వచ్చే ఎన్నికల వరకూ సాంబశివరావునే కొనసాగించాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకోసం ఆయన సాంబశివరావుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాని నెలలో రిటైర్ అయ్యే వ్యక్తిని ఎలా డీజీపీగా నియమిస్తారంటూ యూపీఎస్సీ అడ్డుపుల్ల వేసింది. ప్రస్తుతం పూర్తికాలం డీజీపీగా సాంబశివరావును ప్రభుత్వం నియమించినా... అందుకు యూపీఎస్సీ అనుమతి కావాల్సిందే. దీంతో కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ చేసేందుకు చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక టీమ్ ను పెట్టారట. ముఖ్యంగా కాపు ఉద్యమాన్ని నండూరి చేతనే కట్టడి చేయించాలన్నది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తోంది. మరోవైపు ఒక ఐపీఎస్ అధికారి ఢిల్లీ స్థాయిలో బలమైన లాబీయింగ్ చేస్తుండటంతో వీలుకావడం లేదు. మరి చంద్రబాబు ఈవిషయంలో కేంద్రాన్ని ఎలా ఒప్పించగలుగుతారో చూడాలి.