బాబుకు ఆ సంస్థ‌కు లింకేంటి..!

Update: 2018-01-22 00:30 GMT

జాతీయ స్థాయిలో వివిధ అవార్డులు అందుకున్న ప్ర‌ముఖ కాంట్రాక్టు సంస్థ న‌వ‌యుగ క‌న్స్‌ట్ర‌క్ష‌న్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు కొత్త బంధం పెంచుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను నిర్వ‌హించిన టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ చేస్తున్న ప‌నుల‌కు... చేసుకున్న కాంట్రాక్టుకు పొంత‌న లేద‌ని, ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయ‌ని, తాము అన్ని విధాలా న‌ష్టాల ఊబిలో కూరుకుపోతున్నామ‌ని పేర్కొంటూ.. ఇటీవ‌ల చేతులు ఎత్తేసిన విష‌యం తెలిసిందే. దీంతో వెంట‌నే స్పందించిన సీఎం చంద్ర‌బాబు .. స‌ద‌రు సంస్థ‌పై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోకుండానే స‌బ్ కాంట్రాక్టుకు కొన్ని ప‌నులు అప్ప‌గించేందుకు రెడీ అయ్యారు.

ట్రాన్స్ ట్రాయ్ ప్రేమ ఎందుకో....

వాస్త‌వానికి ఏదైనా కాంట్రాక్టు సంస్థ‌.. ప‌నులు ఒప్పుకుని మ‌ధ్య‌లో ఇలా మొండికేస్తే.. చ‌ర్య‌లు తీసుకునే వెసులుబాటు ప్ర‌భుత్వానికి ఉంటుంది. కానీ, బాబు మాత్రం ట్రాన్స్ ట్రాయ్‌పై మాత్రం తొలినాళ్లలో తన అవ్యాజ ప్రేమ‌ను కురిపించార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అయితే చివరకు పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించాలని బాబు నిర్ణయించారు. ఈ విష‌యంలో కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు బాబు ప్ర‌య‌త్నాల‌కు బ్రేక్ వేస్తూనే ఉంది. అయితే, ఇంత‌లోనే న‌వ‌యుగ కంపెనీ రంగంలోకి వ‌చ్చింది. తాము పోల‌వ‌రం ప‌నుల‌ను కొన‌సాగిస్తామ‌ని త‌మ‌ను అనుమ‌తించాల‌ని కోరింది. అంతేకాదు, ప్ర‌స్తుతం ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి కేటాయించిన కాంట్రాక్టు నిధుల‌కే ప‌నులు పూర్తి చేసి పెడ‌తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. వాస్త‌వానికి ఏ సంస్థ‌కైనా నిబంధ‌న‌లు ఒకే విధంగా ఉంటాయి.

రంగంలోకి నవయుగ....

మ‌రి ట్రాన్స్ ట్రాయ్ త‌న‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని వ‌దిలించుకుంటున్న ప్రాజెక్టును న‌వ‌యుగ ఎలా చేప‌డుతుంది ? అన్న‌ది మిలియ‌న్ డాలర్ల ప్ర‌శ్న‌గా మారింది. అది కూడా ట్రాన్స్ ట్రాయ్ కి కేటాయించే నిధుల‌తోనే తాము ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని చెప్ప‌డం కూడా గ‌మ‌నార్హం. దీనిని చంద్ర‌బాబు గొప్ప‌గా చెప్పుకొచ్చారు. ఇక‌, న‌వ‌యుగ రంగంలోకి దిగుతోంద‌ని, ప‌నులు వేగం పుంజుకుంటాయ‌ని అన్నారు. అయితే, నవయుగ పాత రేట్లకు చేయగలిగినప్పుడు ట్రాన్స్ స్ట్రాయ్ ఇదే పని ఎందుకు చేయలేకపోయింది. ఇన్ని వివాదాలకు కారణం ఎందుకు అయినట్టు అన్న ప్ర‌శ్న‌కు బాబు స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో అబ్బే మాకు లాభం అక్కర్లేదు..చంద్రబాబు లక్ష్యమే ముఖ్యం అని న‌వ‌యుగ‌ సంస్థ ముందుకు రావ‌డంపైనా అనేక సందేహాలు ఉన్నాయి.

ఓడరేవు ప్రాజెక్టుల కోసమేనా?

వీటికి కూడా చంద్ర‌బాబు స‌మాధానం ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుత ప్ర‌పంచంలో లాభం లేకుండా ప‌నిచేసే వారు భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా క‌నిపించ‌డంలేదు. మ‌రి అలాంటి స‌మ‌యంలో న‌వ‌యుగ-బాబుల మ‌ధ్య ఎలాంటి బంధం లేకుండానే పోల‌వ‌రం నిర్మాణానికి ఆ సంస్థ ముందుకు వ‌స్తుందా? అన్న‌దే ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇలాంటి స‌మ‌యంలోనే ఇప్పుడు పోలవరంలో ఉదారంగా పని చేసినందుకు గాను నవయుగాకు ఏపీలో ఉన్న ఓడరేవు ప్రాజెక్టులు..కాంట్రాక్ట్ సంస్థల్లో చంద్రబాబు సర్కారు పరోక్ష ప్రయోజనం కల్పించనుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇది ఉండ‌బ‌ట్టే న‌వ‌యుగ ముందుకు వ‌చ్చి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు . మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News