ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి దూకారు. నిత్యం సమీక్షలు, ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు, బహిరంగ సభలు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఇవే అమరావతి నుంచి ఇచ్ఛాపురం దాకా ఆయన షెడ్యూల్ లో కనిపించేవి. వచ్చేది ఎన్నికల సీజన్, అందులోను విపక్ష నేత జగన్ పాదయాత్రకు సంకల్పించిన తరుణం. మరి ఇలాంటి వేడి వేడి రాజకీయం లో బాబు మాత్రం ఎలా సైలెంట్ గా వుంటారు అందుకే ఆయన ఆకస్మిక పర్యటనలు మొదలెట్టేశారు.
అమరావతి నుంచే శ్రీకారం ....
చంద్రబాబు గతంలో 9 ఏళ్ళ పాలనలో ప్రజల్లో ఇమేజ్ క్రియేట్ చేసి పనిచేసే ముఖ్యమంత్రి అని పేరు తెచ్చినవి ఆకస్మిక పర్యటనలే. ముఖ్యమంత్రి షెడ్యూల్ వేరు ఆయన చేసేది వేరుగా ఉండేది. జిల్లాల పర్యటనలో అలా బాబు అధికారులను నేతలను పరుగులు పెట్టించే వారు. కానీ కాలం తెచ్చిన మార్పో వయోభారం కారణంగానో బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి ఆకస్మిక పర్యటనలను పక్కన పెట్టేశారు. విజయవాడలో ఆయన ఇలా పర్యటించే ఏడాది అయ్యింది . గత గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో జనం చనిపోయాక పదిరోజులపాటు నైట్ రౌండ్స్ తిరిగిన చంద్రబాబు మళ్ళీ ఆ స్థాయిలో ప్రజల్లో మమేకం అయ్యింది పెద్దగా లేదనే చెప్పాలి. ఇప్పుడు పాత చంద్రబాబు బయటకు వచ్చారు. బెజవాడలో నాలుగు గంటలపాటు బాబు ఆకస్మిక పర్యటనలు పాత రోజులను గుర్తుకు తెచ్చాయి.
అలా తిరిగారు ... ఇలా తిట్టారు ...
విజయవాడ లో సుడిగాలిలా తిరిగిన చంద్రబాబు పారిశుధ్య పరిస్థితులపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పనులకు పలు చోట్ల ఆదేశాలు సైతం ఇచ్చారు . బందర్ కాలువ సుందరంగా చేయాలంటూ మంత్రి దేవినేనిని ఆదేశించారు .మధురానగర్ , డ్రైవర్స్ కాలనీల్లోని , వాంబే కాలనీలు , రామవరప్పాడు ట్రాఫిక్ సమస్య పాత ప్రభుత్వ ఆసుపత్రి ఇలా చాలా అంశాలను పరిశీలించి అందరిని పరుగులు పెట్టించారు. అంతేనా ఈ పర్యటన ముగిశాకా ఆయా సమస్యలపై కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పనులకు ఆదేశాలు ఇవ్వడం కొన్నింటిపై సూచనలు చేశారు. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు షూరూ అవుతాయని మంచి రోజు కావడంతో ముందు అమరావతినుంచి ప్రారంభించినట్లు తేలిపోతుంది.