ఆయన పనేదో ఆయన చేసుకుని పోతే ఈయనకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గిల్లడమే పనిగా పెట్టుకుంది కేసీఆర్ సర్కార్. అసలే ఆర్ధిక కష్టాలతో నడుస్తున్న ఏపీ సర్కార్ కి కరెంట్ షాక్ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణాలో 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఇది రైతులకు వరమని ప్రకటించారు గులాబీ బాస్. ఇంతవరకు బానే వుంది. ఆ వరాలను బాబు కి మద్దత్తుగా నిలిచే మీడియా లో ఆంధ్రాలో కూడా ప్రచురితం అయ్యేలా కోట్లు పోసి మరి ప్రకటనలు ఇచ్చారు. ఇది ఇప్పుడు టిడిపి సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ఏ పత్రిక చూసినా ఛానెల్ వీక్షించినా రైతుబాంధవుడు కేసీఆర్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆయన హల్చల్ చేస్తున్నారు.
మాకు ఇమ్మంటే పరిస్థితి ఏమిటి ?
చంద్రబాబు సర్కార్ ను మాకు 24 గంటల ఉచిత విద్యుత్ కావాలని రైతుల్లో ఉద్యమం బయల్దేరితే పరిస్థితి ఏమిటి ? తమ ప్రభుత్వం వస్తే అంటూ వరాలు కురిపిస్తున్న వైసిపి అధినేత కేసీఆర్ సర్కార్ లా 24 గంటలు ఉచిత విద్యుత్ హామీ ప్రకటిస్తే ? ఎన్నికల ఏడాది కావడంతో మళ్ళీ సమస్యల పరిష్కారం అంటూ జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ఏపీ సర్కార్ దర్బార్ లలో రైతులు మూకుమ్ముడిగా 24 గంటల ఉచిత విద్యుత్ కేసీఆర్ లా ఎందుకు ఇవ్వలేక పోతున్నారని డిమాండ్ చేస్తే ? ఇలా అనేక ఇబ్బందులను తెలిసో తెలియకో కేసీఆర్ ఏపీ పై రుద్దారు.
నర్సరీలకే ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు ....
ఇటీవల రోజుకు ఆరు ఏడు గంటల ఉచిత విద్యుత్ కోసం నర్సరీ రైతులు గోదావరి జిల్లాలో కోరితే సబ్సిడీ విద్యుత్ మాత్రమే వారికి సర్కార్ ప్రకటించింది. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ పొందిన నర్సరీ రంగ రైతులు ఇప్పుడు బాబు సర్కార్ పై ఆగ్రహంగా వున్నారు. ఈ దశలో 24 గంటల ఉచిత విద్యుత్ అంశం చంద్రబాబు మెడకు చుట్టుకోనుంది. నష్టాల్లో వున్న ట్రాన్స్ కో జెన్ కో లను గట్టెక్కించడానికి నా నా కష్టాలు పడుతున్న టిడిపి సర్కార్ కి ఎన్నికల ఏడాది అగ్నిపరీక్ష పెట్టారు కేసీఆర్.