నవంబర్ పదో తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నవంబర్ 2వ తేదీనుంచే జగన్ పాదయత్ర స్టార్ట్ అవుతుంది. జగన్ పాదయాత్ర ను డైవర్ట్ చేసేందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు పది రోజుల పాటు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. లోటస్ పాండ్ లో జగన్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రస్తావన వచ్చింది. పాదయాత్ర లో తాను ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేనని జగన్ చెప్పారు. అయితే టీడీపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం గైర్హాజరవ్వడమే మంచిదన్న అభిప్రాయానికి సమావేశంలో అత్యధికమంది నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
నలుగురు మంత్రులను బర్త్ రఫ్ చేస్తేనే.....
వైసీపీ గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం, వారిలో నలుగురిని మంత్రులుగా చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నలుగురు మంత్రులను బర్త్ రఫ్ చేస్తేనే సమావేశాలకు హాజరవుతామని స్పష్టమైన సంకేతాలను టీడీపీ నాయకత్వానికి పంపనుంది. అంతేకాకుండా ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా... కేవలం ప్రభుత్వ పథకాలను బాకా ఊదటానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు దుయ్యబడుతున్నారు. మొత్తం మీద టీడీపీ వ్యూహానికి వైసీపీ ప్రతివ్యూహం రచించిందనే చెప్పుకోవాలి. జగన్ పాదయాత్ర జరుగుతున్ననేపథ్యంలో నలుగురు మంత్రుల బర్త్ రఫ్ కు వైసీపీ పట్టుబట్టనుంది. అయితే దీనిపై శాసనసభ పక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.