పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పార్లమెంటు సభ్యులతో మరోసారి భేటీ కాబోతున్నారు. శుక్రవారం పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకరోజు ముందుగానే ఎంపీలు ఢిల్లీకి వెళతారు. ఏపీలోను బడ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 2వ తేదీనే ఎంపీలతో సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని చంద్రబాబు వివరించనున్నారు.
అనుసరించాల్సిన వ్యూహాలపై....
గత పార్లమెంటు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ విభజన హామీల కోసం పట్టుబట్టింది. పార్లమెంటు కార్యకలాపాలను స్థంభింప చేసింది. ప్రధాని మోడీ ప్రసంగించే సమయంలో మినహాయించి మిగిలిన అన్ని వేళల్లో నినాదాలతో హోరెత్తించింది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ ను ఎన్డీఏ మిత్రపక్షమైన అకాళీదళ్ కూడా సమర్థించింది. పార్లమెంటు లోపల, బయట నిరసనలు తెలియజేసి కేంద్రంపై వత్తిడి తేవడంలో కొంతవరకూ సక్సెస్ అయింది. అయితే ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు కీలకం. ఈ సమావేశాల్లోనూ విభజన సమస్యలపై ఎటువంటి హామీ రాకుంటే రాష్ట్రం ఇబ్బందుల్లోకి వెళ్లడం ఖాయం.
ప్రత్యేకహోదాతోనే....
అయితే గత పార్లమెంటు సమావేశాలకూ, జరగబోతున్న సమావేశాలకు టీడీపీ వైఖరిలో తేడా కన్పిస్తోంది. తాజాగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఏమాత్రం తగ్గకుండా కేంద్రంపై వత్తిడి తేవాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఈ మేరకు ఉభయ సభల్లో పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదీ శుక్రవారం జరగబోయే సమావేశంలో చంద్రబాబు చర్చించనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
శివప్రసాద్ కు వార్నింగ్?
అయితే ఈసారి టీడీపీ ఎంపీ శివప్రసాద్ కు చంద్రబాబు హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. గత సమావేశాల్లో శివప్రసాద్ విచిత్ర వేషాలతో నిరసనలు తెలియజేశారు. అయితే ఆ వేషాలు వెగటు పుట్టించాయని, ఇకనైనా ఇలాంటి వేషాలు మానుకోవాలని పెద్దయెత్తున వివిధ వర్గాలు, పార్టీల నుంచి విమర్శలు విన్పించాయి. వేషాల వల్ల ఆందోళనలకు ఉన్న సీరియస్ నెస్ పోతుందని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. దీంతో శివప్రసాద్ కు ఎలాంటి ‘‘వేషాలు’’ వేయొచ్దని ప్రత్యేకంగా సూచించ వచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.