ఎవరైనా నాకు ఎదురొచ్చినా ... నేను ఎవరికైనా ఎదురు వెళ్ళినా మాడిపోతారు మసైపోతారు అంటూ బాలకృష్ణ ఒక సినిమాలో వినిపించిన డైలాగ్. ఈ డైలాగ్ మాటెలా ఉన్నా కేంద్రం లోని ప్రధాని నరేంద్ర మోడీ కి ఎదురు వెళ్లాలని భావించినా ఆయన వారికి ఎదురువెళ్ళినా ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అనే రీతిలో అనేక రాష్టాల్లో జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విభజన సమస్యలపై కోర్టు కి ఎక్కుతా అన్న వ్యాఖ్యలు చేసి నాలిక కరుచుకుని ఏపీ సీఎం చంద్రబాబు వెనక్కు తగ్గారని అంటున్నారు విశ్లేషకులు. అలా తగ్గే క్రమంలో మీడియా వక్రీకరించిందంటూ నెపం సగటు సాధారణ రాజకీయనేతలు చెప్పినట్లే వారిమీద పెట్టారు. తన వ్యాఖ్యలు బిజెపి కి వ్యతిరేకంగా చేసినవి కాదంటూ సర్దుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. దక్షిణాదిన తమిళనాడులో శశికళ ఎపిసోడ్, గతంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ కి చుక్కలు చూపించిన వైనం, తాజాగా ఢిల్లీ లో ఆప్ సర్కార్ తో కేంద్రం ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకుని నాటకం మొదలు పెట్టిందన్న అంశాలు పరిశీలించాక చంద్రబాబు తన తీరు మార్చుకున్నారని చెబుతున్నారు.
ఒకసారి కాదు రెండు సార్లు అన్న చంద్రబాబు ...
ప్రధాని తో సమావేశం అయ్యి ఢిల్లీ మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు విభజన సమస్యల పరిష్కారం చేస్తారని భావిస్తున్నా అని, లేని పక్షంలో కోర్టు కి అయినా వెళ్ళే ఆలోచన చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత తాజాగా అమరావతి లో కలెక్టర్లతో జరిగిన సమీక్షలో సైతం ఇదే విషయాన్ని మరోసారి ఆయనే చెప్పారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్ట్టించాయి. విపక్షాలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ బయల్దేరడం గమనంలోకి తీసుకున్నారు చంద్రబాబు. కోర్ట్ కి ఎక్కే బదులు కేంద్రంలోని టిడిపి మంత్రులను వెనక్కి పిలిపించాలని సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్ల రచ్చ మొదలు పెట్టేశారు. ఇక విపక్షాలైతే బిజెపి టిడిపి లు ఒకే ప్రభుత్వం గా వున్నప్పుడు ఇదెలా సాధ్యమని నిలదీశాయి. ప్రభుత్వం పై ప్రభుత్వం కేసులు వేసుకోవడం ఏమిటంటూ దుమారమే సృష్ట్టించాయి. దాంతో బాబు తన వ్యాఖ్యలు వక్రీకరణ అంటూ పాత పాట పాడేశారు. గబ గబా వెనక్కు తగ్గారు.
ఇప్పటి టెక్నాలజీలో వక్రీకరణ సాధ్యమా...?
ప్రింట్ మీడియా హవా నడిచే కాలంలో నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేసినా, తప్పుడు లెక్కలు చెప్పినా మీడియా తాము ఒకటి చెబితే మరొకటి ప్రచురించి వక్రీకంచిందంటూ సవరించుకునేవారు. ఆ తరువాత టెక్నాలజీ మారింది. ఎలట్రానిక్ మీడియా తెరపైకి దూసుకువచ్చింది. దీంట్లోనే ఎలాంటి వక్రీకరణలకు ఆస్కారం లేని లైవ్ టెలికాస్ట్ లు మొదలయ్యాయి. తాజాగా అయితే సోషల్ మీడియా శరవేగంగా విస్తరిస్తుంది. దీని ప్రభావం నేతలకు వణుకు పుట్టించేలా వుంది. 95 లో చంద్రబాబు ఏమన్నారు 2004 లో బిజెపి తో కటీఫ్ చెబుతూ బాబు ఏమన్నారు ? 2014 లో మోడీ బాబు ఏమన్నారు ? ఇప్పడు ఏమంటున్నారు అంటూ వాట్స్ అప్ వేదికగా ఫెస్ బుక్ యూట్యూబ్ లింక్ ల్లో నాటి వీడియో క్లిపింగ్స్ తేదీలు సమయం స్థలంతో సహా ప్రజల్లోకి క్షణాల్లో లింక్ ల రూపంలో పోతున్నాయి. అలాంటి కాలంలో నడుస్తూ టెక్నలాజికి ఏపీలో చిరునామాగా చెప్పుకునే చంద్రబాబు తన మాటల వక్రీకరణ అంటూ టిడిపి సమన్వయ కమిటీలో చేసిన వ్యాఖ్యలు ఆయన మోడీ ప్రభుత్వం పట్ల భయపడుతున్నారనే సంకేతాలు ఇస్తూ తన భక్తిని నరేంద్రుడికి మరోసారి చాటలిసిన దుస్థితిని చెప్పక చెప్పేలా చేశాయి అంటున్నారు విశ్లేషకులు.