బాబు రియల్ ఎస్టేట్ బిజినెస్..ఎలాగంటే ...!

Update: 2017-11-15 07:30 GMT

పేదలకు ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ళు దర్జాగా అమ్మేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిబంధనలు మార్చేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తాజా గా చేసిన ప్రకటనలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం మూడు వంతులు నిర్మాణ వ్యయం భరించి నిర్మించి ఇచ్చే ఇళ్ళ ను పేదవారికి ఒక ఆస్తిగా ఇవ్వాలని తద్వారా వారికి భరోసా కల్పించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పేదల సంక్షేమం అభివృద్హి కోసం అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అనధికారికంగా ఎప్పటినుంచో అమ్మేస్తున్నారు ...

ముఖ్యమంత్రి తాజాగా చేసిన ప్రకటన చర్చనీయాంశం కానుంది. ఇప్పటికే పేదలు తమ ఇళ్ళను తనఖా పెట్టుకోవడం లీజు కు ఇచ్చినట్లు రాసి అమ్మేసుకుంటున్నారు. కొందరు పిల్లల చదువులు పెళ్ళిళ్ళ కోసం అప్పుల బాధలు పడలేక అప్పు ఇచ్చిన వారికే వాటిని అమ్మేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనలు మాత్రం సబ్సిడీ ద్వారా కట్టే ఈ ఇళ్ళు అమ్ముకోవడానికి ఇన్నాళ్ళు వారికి ఎలాంటి హక్కులు లేవని చెబుతున్నాయి. ఒకవేళ వారు అమ్మినా, మరొకరు కొన్నా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. తాజాగా చంద్రబాబు చేసిన ప్రకటన పేదవర్గాల వారికి ఒకరకంగా లాభాన్ని మరోరకంగా నష్టాన్ని తెచ్చిపెట్టేదే.

బాబు నిర్ణయం కొత్త సమస్యలు సృష్టిస్తుందా ...?

చంద్రబాబు ఆలోచన మంచిదే అయినప్పటికీ చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా పేదలగృహాల అమ్మకాలు కొనుగోళ్ళు మారిపోనున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, తిరుపతి నెల్లూరు , ఒంగోలు , ఏలూరు , రాజమండ్రి కాకినాడ , విజయనగరం , శ్రీకాకుళం ఇతర ముఖ్య నగరాల్లో ప్రధాన సెంటర్లలో వున్న పేదల ఇళ్ళను బడా బాబులు ప్రలోభ పెట్టి గంప గుత్తగా కొని షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మాణం చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో ఎప్పటిలాగే మళ్ళీ వారు వూరు చివర బతికే పరిస్థితి ఉత్పన్నమౌతుంది. ఇక అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే ఏ పార్టీ అధికారం లో వున్నా ఇళ్ళు దక్కుతున్నాయి. కనుక ఆయా పార్టీల వారు లాభ పడే పరిస్థితి ఉంటుందంటున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇలాంటి ప్రకటన చేశారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి బాబు చేసిన ఈ సంచలన ప్రకటన పై గ్రౌండ్ రియాక్షన్స్ ఎలా వుంటాయో ?

Similar News