ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో తలపండిన నేత. రెండు ప్రధాన సమస్యలను ఆయన కేంద్రం నెత్తిన పెట్టి చోద్యం చూడబోతున్నారు. అందులో ఒకటి పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం అయితే మరొకటి కాపు రిజర్వేషన్ల అంశం. ఈ రెండింటిలో ఏది చేయలేకపోయినా తప్పు కేంద్రానిదే అన్న సంకేతాలు ప్రజలకు ఇచ్చేశారు బాబు. పోలవరానికి నిధులు ఇవ్వాలంటే కేంద్రమే విడుదల చేయాలి. అలాగే కాపులకు ఇవ్వనున్న ఐదు శాతం రిజర్వేషన్ల అంశానికి అసెంబ్లీ ఆమోదించాకా కేంద్రానికి పంపుతారు. అక్కడ రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ సవరిస్తే కానీ బాబు చేసిన ప్రతిపాదన అమల్లోకి రాదు.
రెండు కీలక సమస్యలు బీజేపీపైన....
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు ను ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు. 9 వ షెడ్యూల్ సవరణ కేంద్రం చేయకపోతే ఆయనకు వచ్చే నష్టం లేదు కానీ ఆమోదిస్తే వచ్చే మైలేజ్ బాబును కాపులకు దగ్గర చేయనుంది. పోలవరం ప్రాజెక్ట్ అంశంలోనూ అంతే ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే కేంద్రమే ఆ అభాండం మోయాలిసి ఉంటుంది. చంద్రబాబు తన కత్తికి రెండు వైపులా పదును ఉందని ఆయన తాజా చర్యలు నిరూపిస్తున్నాయి. మరి మోడీ సర్కార్ కీలకమైన ఈ రెండు అంశాల్లో ఎలా స్పందిస్తుందో చూడాలి