అమరావతిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, నిన్న పవన్ కల్యాణ్ ప్రసంగాలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేపుపొలిట్ బ్యూరో సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు చంద్రబాబు. పొలిట్ బ్యూరోలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించక పోవడంతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది.
పవన్ వెనక బీజేపీ...
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీని టార్గెట్ గా చేసుకుని ప్రసంగించడంపై కూడా చంద్రబాబు లోతుగా అధ్యయనంచేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా పవన్ కల్యాణ్ ఎవరిపైనా విమర్శలు దాడికి దిగరు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటారు. అలాంటిది పవన్ కల్యాణ్ లోకేష్ మీద, టీడీపీపైన వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు అనేక రకాలుగా అనుమానిస్తున్నారు. బీజేపీ పవన్ వెనక ఉండి నడిపిస్తుందని భావిస్తున్నారు. తాము కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలిగిన తర్వాతనే పవన్ బయటకు వచ్చి తమపై ఆరోపణలు చేయడం చూస్తుంటే భవిష్యత్తులోనూ బీజేపీతో ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారు.
దృష్టి మరల్చేందుకేనా?
దీంతో రేపు జరగబోయే పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఎన్డీఏ నుంచి వైదొలగాలని చంద్రబాబు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఇక దాడిని పెంచాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది. పవన్ ప్రసంగం తర్వాత పార్టీకి భారీగా డ్యామేజీ అయిందని చంద్రబాబు గుర్తించారు. పవన్ సూటిగా చేసిన ఆరోపణలను ప్రజలు విశ్వసించే అవకాశముందని భావించిన చంద్రబాబు దృష్టి మరల్చడానికే అత్యవసరంగా పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఎన్డీఏ నుంచి విడాకులు తీసుకునేందుకు రేపు ముహూర్తంగా చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.