బాబు నోట మ‌ళ్లీ...మళ్లీ...అదే మాట...అదే పాట‌...!

Update: 2017-12-27 05:30 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు నోరు విప్పినా.. సింగ‌పూర్‌, ధాయ్‌లాండ్‌, దుబాయ్ అంటూ విదేశీ జ‌పం త‌ప్ప మ‌రొక‌టి వినిపించ‌డం లేదు. ఏపీని సింగ‌పూర్ చేస్తానంటారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఖ‌జానా నిండుకుంద‌ని నిట్టూరుస్తారు. రాజ‌ధానిని ప్రపంచ స్థాయిలో నిల‌బెడ‌తానంటూ పెద్ద ఎత్తున ప్రసంగాలు చేస్తారు. ఆ మ‌ర్నాడే.. రాజ‌ధానికి కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేద‌ని వాపోతారు. ఇక‌, రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అనేక కంపెనీలు క్యూక‌ట్టాయ‌ని మీడియాకు చెబుతారు. అంతేకాదు, ఇప్పటికే వంద‌ల ఒప్పందాలు చేసుకున్నామ‌ని, ఫ‌లితంగా ల‌క్షల కొద్దీ ఉద్యోగాలు వ‌చ్చేస్తున్నాయంటారు. మ‌రునాడు మ‌రో మీటింగ్‌లో ఏపీలో విప‌క్ష పార్టీ మూలంగానే పెట్టుబ‌డులు రావ‌డంలేద‌ని విమ‌ర్శిస్తుంటారు. ఇలా చంద్రబాబు మాట‌ల‌కు పొంత‌న‌లేకుండా ఉంటోంది.

ప్రపంచమే...పెట్టుబడిగా....

ఇక‌, ఇప్పుడు తాజా.. మ‌రోసారి ఆయ‌న నోట ప్రపంచ స్థాయి మాట వినిపించింది. ఇటీవ‌ల ఆయ‌న కుటుంబ స‌మేతంగా విదేశాల‌కు గ‌డిపి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారిగా మ‌రోసారి ఆయ‌న నోటి నుంచి ప్రపంచ‌స్థాయిలో ఏపీ అంటూ కామెంట్లు వెలువ‌డ్డాయి. ప్రధానంగా రాష్ట్రంలోని రోడ్లను ప్రపంచ‌స్థాయిలో తీర్చిదిద్దుతాన‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రోడ్లను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామని బాబు అన్నారు. రాజధానిలో రహదారుల నిర్మాణంపై అధికారులతో సమీక్షించిన ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. రహదారుల నిర్వహణ నిర్మాణ సంస్థలకు అప్పగిస్తామని చెప్పారు.

ఊహలలోకంలో....

రహదారుల నిర్మాణంతో లాండ్‌ పూలింగ్‌ రైతుల ప్లాట్ల విలువ పెరుగుతుందని వివరించారు. ప్రతి పదివేల జనాభాకు ఒక టౌన్‌షిప్‌ నిర్మించాలన్నారు. టౌన్‌షిప్‌ ముందు భాగంలో వాణిజ్య అవసరాలకు స్థలం వదలాలని తెలిపారు. భవిష్యత్‌లో భారీ వాణిజ్య సముదాయాలు రావడంతో ఆ ప్రాంతంలో నగర వాతావరణం వస్తుందని సీఎం అన్నారు. టౌన్‌షిప్‌లలో నివాస ప్రాంతాలకు అనుగుణంగా గార్మెంట్‌ తరహా కాలుష్యరహిత యూనిట్లు నెలకొల్పాలని, దీనివల్ల ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని వెల్లడించారు.

స్థానిక బిల్డర్ కు అవకాశం ఇవ్వాలన్నా....

ప్రభుత్వం నిర్మించే పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో స్థానిక బిల్డర్‌లకు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. వాస్తవానికి రాజ‌ధానిలో ఏది ఎక్కడ నిర్మిస్తారో తెలియ‌దు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఇంకా ల్యాండ్ పూలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. దీనికి కేంద్రం నుంచి నిధులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబు త‌న హైఫై త‌ర‌హాను ఏ మాత్రం మార్చుకోవ‌డం లేదు. హోరుగా జోరుగా ప్రక‌ట‌న‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదీ బాబు నోట మ‌ళ్లీ ప్రపంచ స్థాయి మాట‌! అంటూ అధికారులే నిట్టూరుస్తున్నారు.

Similar News