బాబు దెబ్బకు దిగొచ్చారే....!

Update: 2018-02-19 11:30 GMT

చంద్రబాబు కొంత తగ్గినట్లు కన్పిస్తోంది. ఆయన నోట ప్రత్యేక హోదా మళ్లీ బయటకు వచ్చింది. ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని పక్షాలనూ పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఒకప్పుడు కేంద్రంతో నిధులు తెచ్చుకోవడానికి బతిమాలుకునే వారమని, ఇప్పుడు డిమాండ్ చేసే స్థాయికి వచ్చామని ఆయన తెలిపారు. అయితే ప్రత్యేక హోదాపై ఏపీలో సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకునే అవకాశముంది. ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనూ అనేక పక్షాలు అఖిలపక్ష సమావేశాన్నే డిమాండ్ చేశాయి. ఈనేపథ్యంలోనే చంద్రబాబు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలిసింది.

అన్ని పార్టీలతో కలిసి.....

అయితే టీడీపీ ఒక్కటే కాకుండా అన్ని పార్టీలనూ కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికే మొగ్గు చూపారు. ఈ నెల 25వ తేదీ తర్వాత అఖిలపక్ష భేటీ ఉండొచ్చనే సంకేతాలు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు తీరువేరేలా ఉండేది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీకి కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్నో వివరాలు తెలపమంటే....తాను శాసనసభకే జవాబుదారీనని చెప్పిన చంద్రబాబు మెల్లగా సెంటిమెంట్ దెబ్బకు దిగొస్తున్నట్లు కన్పిస్తోంది.

బీజేపీ నేతలకు మాత్రం.....

అయితే అఖిలపక్ష సమావేశానికి ఎవరిని పిలవాలన్నది ఇప్పుడు టీడీపీలో చర్చ జరుగుతుంది. మిత్రపక్షంగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలను ఆహ్వానించడం అనవసరమని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే తాము ఏపీకి చేయాల్సిందంతా చేశామని చెబుతున్నారు. అంతేకాకుండా మంత్రివర్గం నుంచి తామే ముందు వైదొలుగుతామని కూడా హెచ్చరికలు పంపారు. దీంతో బీజేపీని అఖిలపక్ష సమావేశానికి పిలవాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నారు టీడీపీ నేతలు.

కాంగ్రెస్ విషయంలో నో క్లారిటీ....

ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని పిలవక తప్పని పరిస్థితి. ఇక శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా నిత్యం పోరుబాటలో ఉండే వామపక్షాలను కూడా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించే అవకాశముందంటున్నారు. అయితే కాంగ్రెస్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను పిలవడం అనవసరమన్న అభిప్రాయం ముఖ్య నేతల సమావేశంలో వ్యక్తమయినట్లు తెలిసింది. అయితే టీడీపీ, వైసీపీలకు ధీటుగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పోరాడుతున్న విషయాన్ని కొందరు గుర్తు చేశారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, టీడీపీయే లీడ్ తీసుకుని రాష్ట్ర విభజన హామీలపై పోరాటం ఉధృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాకుండా అన్ని పక్షాలు కలిస్తే ఒత్తిడి పెంచే అవకాశమూ ఉందంటున్నారు. మరి అఖిలపక్ష సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Similar News