వైసిపి అధినేత ప్రజాసంకల్ప యాత్ర చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో విపక్షనేత కు జన నీరాజనం పడుతున్నారు. సంక్రాంతి పండుగను ప్రజలతోనే జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసిపి ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జగన్ అక్కడ ఏర్పాటుచేసిన సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలే చేశారు.
రైతుల నోట్లో మట్టికొట్టిన బాబు ...
సహకార రంగంలో వున్న చిత్తూరు డెయిరీ అంతా విజయా డెయిరీ గా పిలుచుకుంటారు దానిని తన హెరిటేజ్ డెయిరీ వ్యాపారం కోసం నష్టాల బాట పట్టించింది చంద్రబాబే అని ఆరోపించారు జగన్. మంచినీటి బాటిళ్లు లీటర్ కి ఇరవై రూపాయలు అమ్ముతుంటే లీటర్ పాలు రైతుల దగ్గర 22 రూపాయలు కొనే స్థితికి తెచ్చింది ఆయనే అని విమర్శించారు. అదేవిధంగా సహకార చక్కర ఫ్యాక్టరీలకు చెరకు రైతులనుంచి పంట వెళ్లకుండా అడ్డుకుని తన వారు నిర్వహించే ప్రయివేట్ ఫ్యాక్టరీలకు అమ్మేలా చేసి అన్నదాతకు గిట్టుబాటు ధర రాకుండా వారి బతుకులు ఛిద్రం చేశారని ఆరోపించారు వైసిపి అధినేత. చక్కర రైతులు కనీసం బెల్లం తయారు చేసుకుని తమిళనాడులో అమ్ముకుందామంటే నల్లబెల్లం తయారు చేస్తున్నారంటూ వారిని కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు.తన సొంత వ్యాపారాలకోసం సొంత జిల్లా ప్రజలనే చంద్రబాబు మోసం చేస్తున్న తీరును తనదైన శైలిలో వివరించారు జగన్. ఇక చిత్తూరు జిల్లాకు గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్ట్ లు వున్నా కాలువలు లేకుండా చేసి పంటలు పండించుకునే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. తనతండ్రి ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇతర వివరాలను వెల్లడించారు ఆయన. జగన్ ప్రసంగాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించడం గమనార్హం.
ఇద్దరికే రుణపడి ఉంటా అన్న రోజా ...
తనకు టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన వైసిపి అని, గెలిపించింది ఇక్కడి ప్రజలని వారిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటా అన్నారు ఎమ్యెల్యే రోజా. జగన్ సమక్షంలో రోజా ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగానికి మంచి రెస్పాన్స్ లభించింది. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో రాబోయే ఎన్నికల్లో వైసిపి అధికారం సాధించి జగన్ సీఎం కావడం అంతే నిజమన్నారు రోజా. చంద్రగిరి పారకాల్వ లో బయల్దేరిన జగన్ పాదయాత్ర నగరి నియోజకవర్గం పాడిరెడు వరకు 12.6 కిలోమీటర్లు సాగింది. 62 రోజులు పూర్తి అయ్యి 63 వ రోజుకు చేరుకుంది. ఇప్పటికి 862 కిలోమీటర్లు జగన్ తన యాత్రలో పూర్తి చేశారు.