సభలు, సమావేశాలు, సమీక్షలు, పాలనాపర వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలూ రాజకీయాలు ఇలా నిత్యం క్షణం తీరికలేని జీవితం గడిపే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆటవిడుపు లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ వచ్చిందంటే తమ సొంత ఊరిలో కుటుంబ సభ్యులతో సందడి చేస్తారు. ఈ తరహా కార్యక్రమాన్ని లోకేష్ , బ్రాహ్మిణి ల వివాహం అయిన తరువాత బాబు మొదలు పెట్టారు. చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జరిగే ఈ సంక్రాంతి వేడుకల్లో బాబు బావమరిది వియ్యంకుడు కూడా అయిన బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణ. సంక్రాంతి మూడు రోజులు చంద్రబాబు ఇంట సరదాలు సంబరంలా సాగుతాయి. నారావారిపల్లెలో ఉన్న పండుగ రోజుల్లో బాబు ప్రోటోకాల్ ను పక్కన పెట్టి బంధువులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆయన మనవడు దేవాంశ్ పుట్టాక బాబు లో మరింత జోష్ మొదలైంది. ఈసారి పండుగకు చంద్రబాబు మనవడు మళ్ళీ ప్రత్యేక ఆకర్షణ.
బాబు అడ్డాలోనే జగన్ కుటుంబం సంక్రాంతి ...
విపక్ష నేత వైఎస్ జగన్ ఈసారి సంక్రాంతి వేడుకలను చిత్తూరు జిల్లాలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ 14,15 తేదీలనాడు పాదయాత్రకు సెలవు ఇచ్చి సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి చిత్తూరు జిల్లా వైసిపి నేతలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రోజాలు స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఈ వేడుకలు సాగనున్నాయి. చంద్రబాబు నారావారిపల్లె సైతం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే ఉండటం ఇక్కడ విశేషం. అలుపెరగని రీతిలో దుమ్ములేపుతూ పాదయాత్ర సాగిస్తున్న జగన్ కి సంక్రాంతి సంబరాలు కొంత ఆటవిడుపు. గత రెండు నెలలుగా కుటుంబానికి దూరంగా వుంటూ ప్రజా సమస్యలపై పాదయాత్ర సాగిస్తున్న జగన్ ను కలిసేందుకు ఆయనతో గడిపేందుకు ఆయన భార్య పిల్లలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోనే చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె ఉండటం అధికార విపక్ష సారధులు ఇద్దరు ఒకే జిల్లా ఒకే నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ జరుపుకోవడం కాకతాళీయమే అయినా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఇక్కడే ఉండనుంది.