బాబు చెప్పినా తమ్ముళ్లు వినడం లేదే ...!

Update: 2017-12-02 05:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంలో ఎవరు బడితే వారు వ్యాఖ్యలు చేయొద్దన్నారు చంద్రబాబు. ఆయన అలా చెప్పారో లేదో మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధినేత మాటలు డోంట్ కేర్ అన్న రీతిలో బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు. ఒరిజినల్ బిజెపి నేతలు కానీ కొందరు అనవసర వివాదాలు తెచ్చి పెడుతున్నారని అన్నారు అయ్యన్న . డూప్లికేట్ బృందంలో దగ్గుబాటి పురంధరేశ్వరి, కావూరి సాంబశివరావు పేర్లను అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. వారంతా కాంగ్రెస్ వారేనని బిజెపి లో చేరి చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ వ్యవహారం నడుపుతున్నారని వివరించారు.

బ్యాలెన్స్ గా మాట్లాడిన సోమిరెడ్డి ...

మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కర్ర విరగకుండా పాము చావకుండా అన్న చందంగా స్పందించారు. కేంద్రప్రభుత్వంతో టిడిపి ప్రభుత్వం వివాదం కొనితెచ్చుకోవాలని భావించడం లేదన్నారు సోమిరెడ్డి. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో వున్న తరుణంలో శరవేగంగా పూర్తి కావలిసిన ప్రాజెక్ట్ కి అడ్డంకులను మాత్రమే ముఖ్యమంత్రి ప్రశ్నించారు అన్నారు ఆయన. ఈ ప్రాజెక్ట్ అంశంలో ఏర్పడిన వివాదం తమ రెండు పార్టీల పొత్తును దూరం చేయలేదని అన్నారు సోమిరెడ్డి. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలన వచ్చే ఎన్నికల్లో తధ్యమని విభిన్నంగా స్పందించారు సోమిరెడ్డి. ఇలా ఇద్దరు మంత్రులు రెండు రకాల ధోరణులతో మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. పైగా పోలవరం వ్యవహారం పై సైలెంట్ గా ఉండమన్నా సీనియర్ నేతలు మాత్రం వెనక్కి తగ్గేలా ఎక్కడా లేకపోవడం గమనార్హం.

Similar News