బాబు చినబాబు కోసం పరఫెక్ట్ గా ప్లాన్ చేశారే...!

Update: 2017-12-14 06:30 GMT

తన రాజకీయ వారసుడిగా రంగంలోకి దింపిన తనయుడు లోకేష్ ను చంద్రబాబు కేబినెట్ సమావేశం లో ప్రశంసించారుట. ఐటి శాఖ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడంతో లోకేష్ ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ విషయాన్నీ చినబాబు లోకేష్ స్వయంగా ప్రకటించుకోవడం మరో విశేషం. ప్రతి అంశంలోనూ పనితీరు ఆధారంగా మార్కులు వేస్తూ మంత్రులు, ఎమ్యెల్యేల కు వణుకు పుట్టించే చంద్రబాబు కుమారుడి ప్రోగ్రెస్ కార్డు లో ఎక్కువ మార్కులే వేయడం మిగిలిన వారికి లోలోపల ఆగ్రహం తెప్పించిందిట. తమ శాఖల ద్వారా ఎంత కష్టపడుతున్నా లాభం లేదనే రీతిలో మాట్లాడుతూ సి గ్రేడ్ లోనే వున్నారని ఆయా శాఖల మంత్రులను బెదిరించే బాబు ఒక్క లోకేష్ కె ఎక్కువ మార్కులు వేయడం అన్యాయమని చెవులు కోరుకుంటున్నారు కొందరు.

బాబు తో అంత వీజీ కాదు ....

ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నారు. మంత్రులు, ఎమ్యెల్యేలే కాదు అధికారులకు చంద్రబాబు ప్రశంసలు దక్కడం బహు అరుదుగానే ఉంటుంది. అలాంటిది కొడుకు విషయంలో ఒకలాగా మిగిలిన వారి విషయం లో మరోలా బాబు వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక ఎదిరించలేక సతమతమౌతున్నారని టిడిపి వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో చంద్రబాబు తన తనయుడు లోకేష్ ను లైమ్ లైట్ లోకి తెచ్చేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగారని చినబాబు ను హైలెట్ చేసేలా తన పార్టీ మీడియా లో వార్తలు కూడా నిత్యం వచ్చేలా చేయాలనీ కూడా చెప్పారని సచివాలయం వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించి జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా ఎమ్యెల్సీగా నామినేట్ చేయడం మంత్రి వర్గంలోకి తీసుకుని కొడుకు ప్రమోషన్ పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేశారు బాబు అని సచివాలయం టాక్.

Similar News