కడప గడప లో అదీ తన ఇలాకాలో అడుగుపెట్టిన టిడిపి అధినేతకు పాదయాత్రలో దుమ్ము దులిపేస్తున్నారు వైసిపి అధినేత జగన్. పులివెందులకు నీరు తెచ్చా అంటున్న చంద్రబాబు ను పదే పదే వెటకారిస్తూ తన తండ్రి చేసిన పనులు తాను చేసినట్లు బాబు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేస్తున్నారు జగన్. పైడిపాలెం ప్రాజెక్ట్ కి 763 కోట్ల రూపాయల అంచనా అయితే గత నాలుగేళ్లలో 23 కోట్లు మాత్రమే బాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని మిగిలిన 740 కోట్ల రూపాయలు వైఎస్ ఇచ్చిందని గుర్తు చేశారు జగన్. ఇక గండికోట ప్రాజెక్ట్ కి వైఎస్ 1100 వందలకోట్ల రూపాయలకు పైబడి ఖర్చు చేస్తే గత నాలుగేళ్లలో 72 కోట్ల రూపాయలు బాబు సర్కార్ ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు వైసిపి అధినేత.
కుప్పం నుంచే వైసిపి విజయానికి శ్రీకారం చుట్టాలి...
రాబోయే ఎన్నికల్లో కుప్పం నుంచే వైసిపి విజయానికి ప్రజలు శ్రీకారం చుట్టాలని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు వైసిపి అధినేత. బాబు ఇప్పటివరకు చేయని అభివృద్ధిని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామన్నారు ఆయన. చంద్రబాబు సొంత ఇలాఖాలో వేలసంఖ్యలో జగన్ పాదయాత్రలో జనం పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది.
జగన్ కి మంత్రి ఉమ కౌంటర్ ....
తన తండ్రి హయాంలో పులివెందుల నీటి కోసం 85 శాతం నిధులు ఖర్చు అయ్యాయని వైసిపి చెబుతుందని వైఎస్ తరువాత నాలుగున్నరేళ్ల ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేశారని గుర్తు చేశారు మంత్రి ఉమ. జగన్ ఎంపీగా వున్నారని, ఆయన కుటుంబం లోని వారు ఎమ్యెల్యేలుగా ఉండి మిగిలిన పనులు ఎందుకు చేయించలేకపోయారని ఇరిగేషన్ నిలదీశారు. దీనికి వైసిపి నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ విసిరారు. టిడిపి ఏమి చేసిందో చెప్పుకోవాలి కానీ వైఎస్ చేసింది కూడా తమ ఖాతాలో కలుపుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలా ఇరు పార్టీలు మాటల యుద్ధంతో ఏపీ రాజకీయాలను శీతాకాలంలో వేడి పుట్టిస్తున్నాయి.