ఏపీ రాజకీయాలన్నీ అవిశ్వాసం చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రత్యేక హోదా డిమాండ్ పెరగడంతో టీడీపీ అప్రమత్తమయింది. ప్రస్తుతం అవిశ్వాసమే ఏపీలోని అన్ని రాజకీయ పక్షాల ముందున్న సవాల్. ముఖ్యంగా అధికార టీడీపీకి అవిశ్వాసం పెను సవాల్ గా మారనుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అవిశ్వాసం ఆఖరి అస్త్రంగా ప్రయోగించాలని చెప్పారు. అయితే టీడీపీ సమన్వయ కమిటీ భేటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
అవిశ్వాసం ఆఖరిలోనేనా?
నిన్న మొన్నటి వరకూ విభజన హామీలపైనే పార్లమెంటు లోపల, బయట ఆందోళన చేసిన టీడీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త సమస్య తెచ్చిపెట్టారు. అవిశ్వాసం అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో అవిశ్వాసం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అన్ని రాజకీయ పక్షాలు ఏకమవుతుండటంతో చంద్రబాబు అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే అవిశ్వాసం పెడితే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోతాయన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత పార్లమెంటును స్థంభింప చేసి న్యాయం కోసం పోరాడి అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే అప్పుడు అవిశ్వాసం ప్రకటించాలన్నది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తోంది. ముందే అవిశ్వాసం ప్రకటిస్తే కేంద్రంతో నేరుగా యుద్ధానికి దిగినట్లవుతుందని అధినేత అభిప్రాయపడుతున్నారు.
అఖిలపక్ష సమావేశంపైనా.....
అయితే తాజాగా జరగనున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించనున్నారు. వైసీపీ అధినేత జగన్ సవాల్, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్షం సమావేశంపై చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం ఇప్పటి వరకూ ఏపీకి చేసిన సాయం, ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సంస్థల గురించి వివరించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుతో పాటు అవిశ్వాసంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కేంద్రంపై పోరాటంలో టీడీపీ లీడ్ రోల్ తీసుకోవాలన్న వ్యూహంతోనే చంద్రబాబు ముందుకు వెళుతున్నట్లు కన్పిస్తోంది.