పవన్ కళ్యాణ్ పోలవరం పై శ్వేత పత్రం ప్రకటించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. లెక్కలన్నీ వెబ్ సైట్ లో పెట్టేసాం చుసుకోండన్నారు చంద్రబాబు. తాజాగా ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై, విభజన హామీలపై లెక్కలు ఇవ్వాలంటూ కేంద్రాన్ని బాబు సర్కార్ ను మరోసారి అడిగారు పవన్ కళ్యాణ్. ఈసారి ఫిబ్రవరి 15 డెడ్ లైన్ కూడా పెట్టారు. దీనిపై గతంలోలాగే స్పందించింది టిడిపి ప్రభుత్వం. లెక్కలన్నీ వెబ్ సైట్ లో పెట్టేసాం చూసుకోండని చెప్పింది. అవి ఏమి కనపడటం లేదని జనసేనాని కౌంటర్ ఇచ్చారు.
బిజెపి డోంట్ కేర్ ....
ఇక బిజెపి దీనిపై స్పందించింది లేకపోయినా పవన్ ఈ ప్రకటన చేసే ముందు జె ఎఫ్ సి ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టాకా అదే సమయంలో ఢిల్లీ లో బిజెపి ఏపీ అధ్యక్షుడు హరిబాబు ప్రెస్ మీట్ పెట్టి అంతకుముందు చెప్పిన లెక్కలే మరోసారి చదివి వినిపించారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇదే విధానంలో వెళ్లేలాగే ఉన్నాయని అంతా భావించారు. పవన్ కి అసలు ప్రభుత్వాలు ఎందుకు జవాబు ఇవ్వాలన్న విమర్శలు బయలుదేరాయి. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ఏర్పడ్డంలో తనపాత్ర ఉండటంతో నైతికంగా వారిని ప్రశ్నలు వేసే హక్కు తనకు ఉందని పవన్ చెప్పుకొచ్చారు. సరే వారు ఇవ్వకపోయినా అందుబాటులో వున్న సమాచారంతో మేధావి వర్గంతో చర్చించి లెక్కలు తేల్చేయాలని నిర్ణయించిన పవన్ ఆ పనిలో బిజీ అయ్యాక టిడిపి లో అంతర్మధనం మొదలైంది.
ఒకటి అడిగితే నాలుగు ఇస్తారట ...
పవన్ జె ఎఫ్ సి ఏర్పాటును ఏపీ లో ప్రజలు స్వాగతిస్తున్నారు. ఏదో ఒక మంచి ప్రయత్నం ఎవరో ఒకరు చేయడం వల్ల రాష్ట్రానికి మేలు సంగతి ఎలా వున్నా టిడిపి బిజెపి బండారం లెక్కలతో తేలుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ జె ఎఫ్ సి కి టిడిపి సర్కార్ లెక్కలు ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన చంద్రబాబు ఇప్పుడు నాలుగు రకాల శ్వేతపత్రాలు ఇచ్చేందుకు పురమాయించారని తెలుస్తుంది. ఈ విషయాన్నీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ధృవీకరించారు. విభజన హామీలు, ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన లెక్కలు, రావాలిసినవి ఇలా నాలుగు రకాలుగా వర్గీకరించి నిజనిర్ధారణ కమిటీ ముందు పెట్టాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. దాంతో ముందు ఇవ్వమని తరువాత ఇస్తామని చెప్పడం ద్వారా చంద్రబాబు ఇంకా కన్ఫ్యూజన్ నుంచి బయట పడలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.