బాబు అలా ... బిజెపి ఇలా

Update: 2018-02-28 04:30 GMT

టిడిపి,బీజేపీల నడుమ మాటలయుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. మిత్రులిద్దరూ ఇప్పుడు కత్తులు సీరియస్ గా నూరేస్తున్నారు. ఒకరి తప్పులు మరొకరు చక్కగా ఎత్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో టిడిపి, బిజెపి ల నడుమ వార్ తీవ్రమైంది.

బాబు వాదన ఇది ....

కేంద్రం ఏమీ సాయం చేయడం లేదని తాను పనిచేయడం మానేయలేదని అంటున్నారు టిడిపి అధినేత. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు లేదని చెప్పి ఇప్పుడు పొడిగించారని కనుక ఏపీకి ఇచ్చి తీరాలన్నదే తమ పోరాటం అన్నారు చంద్రబాబు. భాగస్వామ్య సదస్సులు దేశంలో 24 జరిగితే తానొక్కడినే ఏపీలో 6 సదస్సులు నిర్వహించడం గొప్ప విషయమని ఈ ఏడాది నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు, 11 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పుకొస్తున్నారు. సాయం అందినా అందకపోయినా అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందా అని భాగస్వామ్య సదస్సులో అడిగారని ఖచ్చితంగా వస్తుందని జవాబు చెప్పానని ప్రజలు కాంగ్రెస్ పై ఇంకా కోపంగా వున్నారని, బిజెపి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రగిలిపోతున్నారని ఈ రెండు పార్టీలకు ఏపీలో సీన్ లేదంటున్నారు చంద్రబాబు.

సోము ఎటాక్ ఇది ....

హోదా కోసం భాగస్వామ్య సదస్సులో పారిశ్రామిక వేత్తలు చంద్రబాబును అడిగారా అని ప్రశ్నిస్తున్నారు బిజెపి ఎమ్యెల్సీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు, 11 లక్షల ఉద్యోగాలు హోదా లేకుండానే వచ్చాయి కదా అన్నది సోము వాదన. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే టిడిపి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు సోము. ఈ అంశాలు ఎవరితోనయినా చర్చించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి ఎదురుగా కూడా ధైర్యంగా చెప్పగలనని సవాల్ చేస్తున్నారు వీర్రాజు.

ఎప్పటికి సెట్ అవుతుందో ...

కేంద్ర రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్లో కలిసే వుంటూ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు టిడిపి, బిజెపి ఇప్పట్లో ఆపేలా లేవు. ఇవి సామాన్యులను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయి. అధికారంలో వున్న రెండు పార్టీలు ఏపీకి ద్రోహమే చేశాయనే వ్యాఖ్యలు మీడియా చర్చ వేదికల్లో విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఇదే అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో కూడా చర్చల రూపంలో నడుస్తుందంటున్నారు. ఇక వీరి ఎపిసోడ్ టివి సీరియల్ మాదిరి సాగిపోతుండటంతో సర్వత్రా రాజకీయ చర్చలే నడుస్తున్నాయి.

Similar News