అనుకున్నట్లే జరుగుతోంది. రెండు దశాబ్దాల మధ్య ఉన్న బంధాన్ని తెంచుకోవడానికే సిద్ధమవుతోంది. మహారాష్ట్రలోని శివసేన పార్టీ కమలం పార్టీతో స్నేహానికి కటీఫ్ చెప్పేసింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని శివసేన నిర్ణయించింది. ఈరోజు జరిగిన శివసేన జాతీయ కౌన్సిల్ సమావేశంలో పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన మహారాష్ట్రలో విడివిడిగానే పోటీ చేస్తాయి. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు కూడా శివసేన ప్రకటించడం విశేషం.
రెండు దశాబ్దాల స్నేహం....
దాదాపు రెండు దశాబ్దాల స్నేహం. బీజేపీ, శివసేన కలిస్తే మహారాష్ట్రను ఏలేయవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగానే పోటీ చేశాయి. అయితే బీజేపీ మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, శివసేనలు ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా శివసేన కు తగిన గౌరవం ఇస్తూనే పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణ నుంచి శివసేనలో మార్పు కన్పిస్తోంది. తమను సంప్రదించకుండానే మంత్రివర్గ విస్తరణ చేపట్టడాన్ని శివసేన నేతలు తప్పుపడుతున్నారు.
కొద్దిరోజుల నుంచి విమర్శలు....
అలాగే గత కొంతకాలం నుంచి తన అధికార పత్రిక సామ్నాలో గాని, బయటగాని శివసేన నేతలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో బహిరంగంగానే శివసేన తప్పుపట్టింది. నోట్ల రద్దును పిచ్చిపనిగా శివసేన అభివర్ణించింది. అప్పటి నుంచే శివసేన, బీజేపీల మధ్య విభేదాలు బహిరంగమవుతూ వస్తున్నాయి. ఒకదశలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కూటమిలో ఉంటే ఉండొచ్చు...లేకుంటే బయకు వెళ్లొచ్చన్న సంకేతాలు కూడా ఇచ్చారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో్ కూడా బీజేపీ, శివసేన విడివిడిగానే పోటీ చేశాయి.
రాహుల్ పై పొగడ్తలు....
కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్న కాంగ్రెస్ ను కూడా పొగడటం ఇటీవల శివసేన నేతలు అదేపనిగా పెట్టుకున్నారు. రాహుల్ రాజకీయంగా రాటుదేలారని వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రాహుల్ పై శివసేన నేతలు ప్రశంసలు కురిపించారు. దీంతో శివసేన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తుందని ఆరోజే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈరోజు మాత్రం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాత్రం బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ, కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్న శివసేన తప్పుకుంటుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద శివసేన నిర్ణయం ఎవరికీ ఆశ్చర్యం కల్గించకపోయినా ఇద్దరికీ ఇది నష్టదాయకేమనంటున్నారు విశ్లేషకులు.