ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో జగన్ సంచలన నిర్ణయం

Update: 2017-12-10 08:30 GMT

వచ్చే ఎన్నికల్లో కుటుంబసభ్యులెవరినీ బరిలోకి దింపకూడదని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకూ కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈ సలహా ఇవ్వడంతో జగన్ దానికి ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రచారంలో కూడా ఈసారి జగన్ తల్లి విజయమ్మ పాల్గొనే అవకాశాలు కూడా లేవని సమాచారం. గత ఎన్నికల్లో విజయమ్మను విశాఖ నుంచి పోటీ చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓటమి పాలు కావడంతో వైఎస్ కుటుంబానికే అప్రదిష్ట వచ్చింది. కడప జిల్లాలో కాకుండా ఎక్కడ పోటీ చేసినా కష్టమేనన్నది ఆ ఎన్నిక ఫలితాలతో తేలిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయమ్మను బరిలోకి దించకూడదని జగన్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

ప్రచారానికి కూడా.....

మరోవైపు విజయమ్మ ఈసారి ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం లేదు. గత ఎన్నికల్లో విజయమ్మ ప్రచారం పార్టీకి కొంత ఇబ్బందులు కల్గించాయన్న వాస్తవాన్ని జగన్ గ్రహించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయమ్మను ప్రచారానికి దింపకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే జగన్ సోదరి షర్మిలను ఎన్నికల్లో పోటీ చేయించకుండా ప్రచారానికి మాత్రం వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర చేస్తున్నారు. నవంబరు 6వ తేదీన ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర ఇప్పటికి నెల రోజులు దాటింది. 430 కిలోమీటర్ల మేరకు ప్రయాణించారు. అయినా విజయమ్మ జగన్ వద్దకు రాకపోవడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జగన్ 31వ రోజు పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. కోడూరు మండలం కమ్మూరులో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. అక్కడి నుంచి అరవకూరు మీదుగా కూడేరుకు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. రాత్రి 7గంటలకు జగన్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు.

Similar News