ఫ్యామిలీ...ఫ్యామిలీ మొత్తం అంతేనా?

Update: 2017-11-17 18:29 GMT

ఫ్యామిలీ...ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా? అని ఓ తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్. అలాగే తమిళనాడులో శశికళ ఫ్యామిలీ అంతా అడ్డగోలు సంపాదనకు అలవాటు పడింది. జయలలిత అధికారంలో ఉండటం... తాను చెప్పినట్లే జయలలిత నడుచుకుంటుండటంతో శశికళకు తిరుగులేకుండా పోయింది. దీంతో ముప్ఫయి వేల కోట్లకు పైగా ఆస్తులు శశికళ కుటుంబం సంపాదించింది. మన్నార్ గుడిలో సామాన్య కుటుంబం ఈరోజు వేల కోట్ల కు పడగలెత్తింది. శశికళ, ఆమె వదిన ఇళవరసి ఇప్పటికే అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

నటరాజన్ కు రెండేళ్ల జైలు శిక్ష...

అయితే తాజాగా శశికళ భర్త నటరాజన్ కు కూడా జైలు తప్పేట్లు లేదు. శశికళ భర్త నటరాజన్ కు మద్రాస్ హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పన్నుల ఎగవేతతో పాటు, అక్రమంగా కార్లను దిగుమతి చేసుకున్న కేసు కూడా నటరాజన్ మెడకు చుట్టుకుంది. ఈ కేసుల్లో 2010లోనే వీరు దోషులుగా తేలింది. అయితే నటరాజన్ తన ఆరోగ్యం బాగాలేదని, శిక్ష నుంచి మినహాయించాలని చేసుకున్న పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. నటరాజన్ తో పాటు మరో ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించడం విశేషం. చూస్తూ ఉంటే వివిధ కేసుల్లో మన్నార్ గుడి మాఫియా మొత్తం జైలు పాలవ్వక తప్పేట్లు లేదు.

Similar News